యువతకు ఉద్యోగాలు ఎక్కడ?.. బీజేపీ ప్రభుత్వంపై AIYF ఫైర్

కలం, కరీంనగర్ బ్యూరో: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో, వారి ఆకాంక్షలను నెరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని ఏఐవైఎఫ్ (AIYF) జిల్లా ప్రధాన కార్యదర్శి బ్రాహ్మణపల్లి యుగంధర్ విమర్శించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ యువజన వ్యతిరేక విధానాలపై యువత ఉద్యమాలకు సిద్ధం కావాలని యుగంధర్ పిలుపునిచ్చారు.

కరీంనగర్ (Karimnagar) అఖిల భారత యువజన సమాఖ్య (AIYF) జిల్లా అధ్యక్షులు పోలోజు రంజిత్ అధ్యక్షతన, బద్దం ఎల్లారెడ్డి భవనంలో ఆ సమాఖ్య జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బ్రాహ్మణపల్లి యుగంధర్ మాట్లాడుతూ.. గత 12 సంవత్సరాలుగా యువతకు ఉపాధి ఉద్యోగం కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన బీజేపీ 12 సంవత్సరాలైనా కనీసం కోటి ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను బలహీన పరుస్తూ కాంట్రాక్టు కన్నా అవుట్ సోర్సింగ్ విధానాలను ప్రోత్సహిస్తూ శాశ్వత ఉద్యోగ అవకాశాలను కుదిపేస్తుందని ప్రభుత్వ రంగ ఉద్యోగాల నియామకాలను పూర్తిగా తుంగలో తొక్కుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ ప్రైవేటీకరణ నియామకాలలో జాప్యం, విద్యా, వైద్య రంగాల వాణిజ్యీకరణ వల్ల యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు.

ఏఐవైఎఫ్ యువజన సంఘాన్ని కరీంనగర్ జిల్లాలో గ్రామ గ్రామాన నిర్మాణం చేసి యువతను ఏఐవైఎఫ్ లో చేర్పించాలని కోరారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం కార్యకర్తలు ఉద్యమాలకు సిద్ధం కావాలన్నారు. గతంలో రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం యువజన సంక్షేమానికి ప్రత్యేకమైన సమగ్ర విధానం అమలు చేయలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో నూతన ఉద్యోగాల కల్పన లేదని, దీనివల్ల రాష్ట్రంలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు.

ఈరోజు ఢిల్లీలో నీట్ ప్రశ్నాపత్రం లీకేజీ కారకుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని యువత పార్లమెంట్ కి తరలితే వారిపై పోలీసులు భాష్ప వాయువులు ప్రయోగించి, వాటర్ క్యాన్లను ఉపయోగించి లాఠీఛార్జ్ చేయడాన్ని ఏఐవైఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ సమావేశంలో ఏఐవైఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కసిభోసుల సంతోష్ చారి, ఉపాధ్యక్షులు కాల్వ శ్రీనివాస్ యాదవ్, కోశాధికారి పినమల్ల ఉదయ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: హైడ్రా కమిషనర్ పై హైకోర్టు సీరియస్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>