రైతే రాజు దిశగా అడుగులు.. ఖమ్మంలో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం

కలం, ఖమ్మం బ్యూరో: రైతు కేవలం పంట పండించడానికే పరిమితం కాకుండా, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ దిశగా అడుగులు వేసినప్పుడే ‘రైతే రాజు’ అనే నినాదం నిజమవుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) స్పష్టం చేశారు. అందులో భాగంగా ఖమ్మం (Khammam) జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం గ్రామంలో రూ. 300 కోట్ల భారీ వ్యయంతో 113 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ‘గోద్రెజ్ ఇంటిగ్రేటెడ్ పామ్ ఆయిల్ పరిశ్రమ’ ఒక ప్రధాన మైలురాయిగా నిలవనుందన్నారు.

సోమవారం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala), గోద్రెజ్ మేనేజ్‌మెంట్ ప్రతినిధులతో కలిసి ఆయన ఈ సమీకృత పరిశ్రమను ప్రారంభించారు. ​ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గతంలో ఆయిల్ పామ్ సాగుకు అవసరమైన నాణ్యమైన విత్తనాలు, శాప్లింగ్స్ కోసం మలేషియా, ఇండోనేషియా వంటి విదేశాలపై ఆధారపడాల్సి వచ్చేదని గుర్తుచేశారు.

కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని, కొణిజర్లలో ఏర్పాటు చేసిన ఈ భారీ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణ నుంచే దేశమంతటికీ అవసరమైన విత్తనాలను సరఫరా చేసే స్థాయికి చేరుకుంటున్నామని హర్షం వ్యక్తం చేశారు. ఈ 113 ఎకరాల కాంప్లెక్స్‌లో సీడ్ జెనెటిక్స్, సీడ్ గార్డెన్, విశాలమైన నర్సరీ, పరిశోధనా కేంద్రం మిల్లింగ్ రిఫైనింగ్ సదుపాయాలు ఒకే చోట అందుబాటులోకి రావడం ఖమ్మం జిల్లా రూపురేఖలను మార్చేస్తుందన్నారు.

​ఖమ్మం జిల్లా కేవలం వ్యవసాయానికే పరిమితమైన తరుణంలో, ఇక్కడి రైతాంగానికి అధిక దిగుబడితో పాటు స్థిరమైన రాబడి అందించేందుకు ఆయిల్ పామ్ సాగు (Oil Palm Cultivation) ఒక అద్భుతమైన వరమని వ్యాఖ్యానించారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ, పాలేరు, వైరా రిజర్వాయర్లపై ఆధారపడి పంటలు పండించే రైతులకు ఎల్ నినో వంటి విపత్కర పరిస్థితులు లేదా వర్షాభావ స్థితిగతులు ఏర్పడినా ఈ సాగు వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదని భరోసానిచ్చారు. పామ్ ఆయిల్ సాగును మరింత విస్తరించడానికి ప్రభుత్వం ఎకరాకి రూ. 4,000 నుండి రూ. 45,000 వరకు సబ్సిడీ అందిస్తోందని తెలిపారు.

2023లో ఒక టన్ను గెల ధర రూ. 12,500 ఉండగా, నేడు అది రూ. 23,000 వరకు పెరిగిందని, రైతులు ఈ ఆర్థిక ప్రయోజనాలను గమనించి వాణిజ్య పంటల వైపు మళ్లాలని సూచించారు. ​దేశంలో ప్రస్తుతం 25 లక్షల మిలియన్ టన్నుల పామాయిల్ అవసరం ఉండగా, కేవలం 12 లక్షల మిలియన్ టన్నులు మాత్రమే ఉత్పత్తి అవుతోందని ఆయన వివరించారు. దిగుమతుల కోసం ఏటా రూ. 1.5 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం చెల్లించాల్సి వస్తోందని, దేశీయంగా 70 లక్షల ఎకరాల్లో సాగుకు అవకాశం ఉన్నప్పటికీ కేవలం 15 లక్షల ఎకరాల్లోనే సాగు జరుగుతోందని పేర్కొన్నారు.

తెలంగాణలో ఈ సాగును ముమ్మరం చేయడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయవచ్చని చెప్పారు. ​ఈ పరిశ్రమ ఒక ‘యాంకర్ ఇండస్ట్రీ’గా మారి పరిసర ప్రాంతాల్లో అనేక అనుబంధ పరిశ్రమలకు దారితీస్తుందని, ఈ ప్రాంతం అగ్రో-బేస్డ్ పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రాజెక్టుకు అవసరమైన రహదారులను ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్న తమ ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 9 రోజుల్లోనే రూ. 9,000 కోట్లను ‘రైతు భరోసా’ కింద నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసిందని ఈ సందర్భంగా భట్టి విక్రమార్క (Bhatti) గుర్తుచేశారు.

Read Also: ప్రమాదంలో కోట్లాది యువత.. WHO సంచలన రిపోర్ట్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>