కలం, వెబ్ డెస్క్: ఆఫీస్, ఇల్లు, రన్నింగ్, జాగింగ్.. ప్లేస్ ఏదైనా సరే రోజువారి జీవితంలో ఇయర్‌ఫోన్స్ (Earphones) భాగమైపోయాయి. ఇవి వినోదాన్ని అందించినప్పటికీ.. గంటల తరబడి వాడటం వల్ల వినికిడి శక్తి శాశ్వతంగా దెబ్బతినే ప్రమాదం (Risk of Hearing) ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెవి లోపలి భాగంలో ఉండే సూక్ష్మ కణాలు దెబ్బతింటే మళ్లీ పనిచేయవు. ఇది శాశ్వత చెవుడుకు దారితీస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. ఇయర్‌ఫోన్స్ వాడటం వల్ల ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా యువత వినికిడి లోపం బారిన పడే ప్రమాదంలో ఉన్నారు. నిరంతరం వీటిని వాడటం వల్ల చెవిలో ఇన్ఫెక్షన్లతో తలనొప్పి, ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
పెరుగుతున్న ప్రమాదాలు
ఇయర్‌ఫోన్స్ వాడుతూ డ్రైవింగ్ చేయడం కూడా ప్రమాదకరమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తక్కువ శబ్దంలో వింటున్నప్పటికీ, ఇయర్‌ఫోన్స్ దృష్టిని మరల్చి, చుట్టూ జరిగే పరిణామాలను గమనించకుండా చేస్తాయి. నడుస్తున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వచ్చే వాహనాల హారన్లు, అత్యవసర సైరన్లు, తోటి ప్రయాణికుల హెచ్చరికలు వినపడకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు తీవ్రంగా పెరుగుతాయి. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు, రహదారులపై ప్రయాణిస్తున్నప్పుడు ఇయర్‌ఫోన్స్ వాడటాన్ని అనేక చోట్ల నిషేధించారు. ఎంటర్టైన్మెంట్ కంటే ఆరోగ్యమే ముఖ్యమని తెలియజేస్తూ.. ఇయర్‌ఫోన్స్ వాడకాన్ని తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
రోజంతా వాడితే..
రోజంతా ఎక్కువ సమయం ఇయర్‌ఫోన్స్ ఉపయోగించడం వల్ల వినికిడి శక్తితోపాటు ఆరోగ్యం సైతం దెబ్బతినే ప్రమాదముందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. తరచుగా వాల్యూమ్ పెంచడం, ఇయర్ఫోన్లు తీసేసిన తర్వాత చుట్టుపక్కల శబ్దాలు వినిపించకపోవడం, ఇతరులను మళ్లీ మళ్లీ మాట్లాడమని కోరడం లాంటివి పరిమితికి మించి ఇయర్‌ఫోన్స్ వాడుతున్నారని తెలియజేస్తోంది. ఒకవేళ చెవుల్లో నిరంతరం శబ్దం, ఇతరుల మాటలు సరిగ్గా వినిపించకపోతే కచ్చితంగా వినికిడి సమస్యలు ఉన్నట్లు గుర్తించాలి. చెవుల ఆరోగ్యం కోసం వాల్యూమ్‌ను తక్కువగా పెట్టుకోవడం, క్రమం తప్పకుండా విరామం తీసుకోవడం లాంటివి చేయాలి. అయినా సమస్యలు బాధిస్తే వెంటనే డాక్టర్ల సలహా తీసుకోవడం మంచిదని నిపుణులు చెప్తున్నారు.
Read Also: హ్యాకర్లకు చెక్ పెట్టాలంటే.. వాట్సాప్ లో ఈ ఫీచర్లు ఆన్ చేయండి!
Follow Us On: Instagram

