కలం, తెలంగాణ బ్యూరో: బీజేపీ (Telangana BJP)లో ఉప్పూనిప్పుగా ఉన్న బండి సంజయ్, ఈటల రాజేందర్ ఒక్కటి కావడం వెనుక ఆ పార్టీ అవలంబించిన బీసీ గేమ్ ప్లాన్ ఉన్నదని తెలుస్తున్నది. బీసీ ఓటు బ్యాంక్ కోసం ఇద్దరు బీసీ నేతల మధ్య నెలకొన్న వర్గపోరుకు హైకమాండ్ ఫుల్స్టాప్ పెట్టింది. సంజయ్, ఈటల మధ్య నెలకొన్న వర్గపోరుతో పార్టీకి నష్టం జరుగుతున్నదని గ్రహించిన అధిష్టానం.. ఢిల్లీ నుంచి బీజేపీ చీఫ్ నితిన్ నబిన్, మాజీ చీఫ్ జేపీ నడ్డాను హైదరాబాద్ పంపించి మంతనాలు జరిపించింది.
అందరి అభిప్రాయాలు తీసుకొని చివరకు ఇద్దరు నేతలను కలపక తప్పదనే నిర్ణయానికి వచ్చింది. మధ్యవర్తిగా అభయ్ పాటిల్‌ను రంగంలోకి దించి, ఇద్దరినీ ఒక్కటి చేసింది. అయితే ఈ పరిణామంపై బీజేపీలోనే సరికొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతానికి ఇద్దరూ చేతులు కలుపుకున్నా పార్టీలో పలుకుబడి కోసం, హైకమాండ్ మెప్పు కోసం, పదవుల కోసం, బాధ్యతల కోసం పోటీ తప్పదనే సందేహాలు ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. బీసీ ఓట్ బ్యాంక్ కన్సాలిడేషన్ కోసం పార్టీ హైకమాండ్ తన వంతు వ్యూహాన్ని అమలు చేసినా, క్షేత్రస్థాయిలో ఈ ఇద్దరి వ్యూహాలు ఎలా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
సీఎం చైర్ కోసం సరికొత్త పోరు
సంజయ్, ఈటలను కలిపినా.. హైకమాండ్‌కు భవిష్యత్తులో తలనొప్పి తప్పదని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. “వీరిద్దరినీ కలపడం తాత్కాలిక ఉపశమనం మాత్రమే. ఒకే జిల్లాకు చెందిన వీరి మధ్య ‘పైచేయి’ కోసం ఆధిపత్య పోరు, కోల్డ్ వార్ చల్లారడం అనుమానమే. దీనికి మించి భవిష్యత్తులో మరో రకమైన విభేదాలు తీవ్ర స్థాయిలో ఉండే అవకాశం ఉంది. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రి ఉంటారని గతంలోనే పార్టీ అధిష్టానం ప్రకటించింది.
ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరికి సీఎం చైర్ దక్కుతుందనేది చర్చనీయాంశం. అందుకే మరో రూపంలో వీరి మధ్య చాపకింద నీరులా వార్ కంటిన్యూ అవుతుంది” అని ఓ నేత వ్యాఖ్యానించారు. ఉప్పూనిప్పులా ఉన్న వీరిద్దరినీ పార్టీ తన అవసరాల కోసం ఒక్కటి చేసినా ‘భవిష్యత్తులో నాకేంటి?’ అనే ప్రశ్నకు సమాధానం కీలకం కానున్నది. హిందుత్వ ఐడియాలజీతో బండి సంజయ్‌కు గుర్తింపు, ఉద్యమ నాయకుడిగా, బీసీ ఫేస్‌గా ఈటల రాజేందర్‌కు గుర్తింపు ఉన్నది. ఇద్దరూ బీసీ వర్గానికి చెందినవారు, ఒకే జిల్లాకు చెందినవారు కావడంతో పార్టీ బాధ్యతల్లో, ప్రోగ్రామ్‌ల నిర్వహణలో పోటీ తప్పదనే మాటలూ వినిపిస్తున్నాయి. ఇక బీసీ సీఎంగా వీరిద్దరిలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది సమాధానం లేని ప్రశ్న.
వర్గాలకు చెల్లు చీటీ.. వలసలకు ప్లానింగ్
బీజేపీలో వర్గపోరును నివారించడంలో అభయ్ పాటిల్ సక్సెస్ కావడంతో పార్టీలో ఒకింత జోష్ నెలకొన్నది. ఇద్దరు లీడర్ల అనుచరులు, కేడర్‌లోనూ ఉత్సాహం కనిపించింది. వర్గాలు లేని పార్టీగా బీజేపీని నిలబెట్టడంలో ఢిల్లీ రాయబారం పనిచేసింది. దీంతో ఇతర పార్టీల నుంచి ఆకర్షించేందుకు మార్గం సుగమమైంది.
పార్టీలో గ్రూపులు లేవనే మెసేజ్ ఇవ్వడంలో బీజేపీ సక్సెస్ అయినా ఈ ఇద్దరూ వలస నేతలను పార్టీలోకి తీసుకొచ్చి బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు రానున్న రోజుల్లో ముమ్మరం కానున్నాయనే వాదన సైతం తెరపైకి వస్తున్నది. పార్టీని 2028 అసెంబ్లీ ఎన్నికల్లో పవర్లోకి తీసుకురావడమే లక్ష్యంగా రెండు సమాంతర శక్తులుగా ఉన్న బండి సంజయ్, ఈటల రాజేందర్ వర్గాలను హైకమాండ్ ఒక్కటి చేసింది. ఒకరికి వ్యతిరేకంగా మరొకరు ఫ్లెక్సీలు కట్టి, పోస్టర్లు వేసుకుని ఒకే వేదికను పంచుకోలేనంత భేదాభిప్రాయాలతో ఇప్పుడు ఒక్కటి కావడం ద్వారా ఎవరికి ప్రయోజనం ఎంత అనే చర్చ మొదలైంది.
గ్రేటర్ ఎన్నికల్లో తేలనున్న ఎఫెక్ట్
బండి సంజయ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను గెలిపించుకోగలిగారు. త్వరలో జరగనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా ఈటల రాజేందర్ తనదైన ముద్రను ఎస్టాబ్లిష్ చేయడం అనివార్యంగా మారింది. ఐదేండ్ల క్రితం జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బండి సంజయ్ చొరవ తీసుకుని బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చేలా చేశారని పార్టీ రాష్ట్ర, కేంద్ర నాయకత్వం గుర్తించింది.
ఈసారి అర్బన్ ఓటు బ్యాంకును కన్సాలిడేట్ చేయడం ఈటలకు అగ్నిపరీక్ష లాంటిది. బండి సంజయ్ సహకారాన్ని తీసుకుంటారా? లేదంటే ఈటల ఒంటరిగా బాధ్యతలు చేపడతారా? అనేది రానున్న రోజుల్లో తేటతెల్లం కానున్నది. మజ్లిస్ వ్యతిరేకతతో హిందుత్వ ఐడియాలజీ వర్కవుట్ అయ్యే గ్రేటర్ పరిధిలో బండి సంజయ్ సహకారం కీలకం కానున్నది. సంస్థాగత కార్యక్రమాల నిర్వహణ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక సమయంలో వీరిద్దరి ఐక్యత ఏ మేరకు పనిచేస్తుందనేది కాలమే సమాధానం చెప్పనున్నది.

