కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) ప్రక్రియను రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, నిర్మల్ (Nirmal) నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా గాజులపేట్, బుదవార్పేట్, బంగల్పేట్, బెస్తవార్పేట్, గుల్జార్ మార్కెట్, బాగులవాడ, భాగ్యనగర్ కాలనీలలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్‌వోలు), కాంగ్రెస్ పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా, ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని తాహెర్ బిన్ హందాన్ సూచించారు. ఓటరు నమోదు సమయంలో ఎదురవుతున్న సమస్యలను బీఎల్‌వోలు, బీఎల్‌ఏలను అడిగి తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులతో అన్నారు.
ఈ క్రమంలోనే ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడడం అందరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించే దిశగా కాంగ్రెస్ పార్టీ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. అర్హులైన వారంతా ఓటరు జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
Read Also: చెన్నూరులో అధికారులపై కారంపొడి, పెట్రోల్‌తో దాడి.. కారణం ఇదే!
Follow Us On : WhatsApp

