కాల్వ పారదు.. నీరు చేరదు.. రైతుల కన్నీళ్లు!

కలం, నల్లగొండ బ్యూరో : కోట్లాది రూపాయల నిధులు వెచ్చించినా క్షేత్రస్థాయిలో సరైన ప్రణాళిక.. అధికారుల సమన్వయం లోపిస్తే ప్రజాధనం ఎలా వృథా అవుతుందో చెప్పడానికి నల్లగొండ (Nalgonda) జిల్లాలోని 7బి డిస్ట్రిబ్యూటరీ (హైలెవల్ కెనాల్) ఒక నిదర్శనంగా నిలిచింది. పీఏ పల్లి మండలంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (ఏకేబీఆర్) నుంచి గుర్రంపోడ్ మండలంలోని ఎగువ ప్రాంతాలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో ఈ ప్రాజెక్టును తలపెట్టారు. కానీ, నేడు ఈ కాలువ కేవలం కాగితాలకే పరిమితమై.. రైతులకు కన్నీళ్లను మిగులుస్తోంది.

గత 2008లో రూ.19 కోట్ల అంచనా వ్యయంతో అక్కంపల్లి రిజర్వాయర్ నుండి గుర్రంపోడ్ మండలంలోని తేనపల్లి చెరువు వరకు సుమారు 18 కిలోమీటర్ల మేర ఈ డిస్ట్రిబ్యూటరీ తవ్వకానికి నిధులు మంజూరయ్యాయి. 2009 జనవరిలో ప్రారంభమైన పనులు నత్తనడకన సాగుతూ ఎట్టకేలకు పదేళ్ల తర్వాత.. అంటే 2018లో తానేదారిపల్లి గ్రామ చెరువు వరకు పూర్తయ్యాయి. ఆ ఏడాది అట్టహాసంగా నీటిని విడుదల చేసిన అధికారులు, ఆ తర్వాత మళ్లీ అటువైపు కన్నెత్తి చూడలేదు. నాటి నుంచి నేటి వరకు ఈ కాలువలో కృష్ణా జలాలు పారిన దాఖలాలు లేవని ఆయకట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

లోపభూయిష్టమైన డిజైన్.. డీప్ కట్ శాపం..

ఈ ప్రాజెక్టులో అత్యంత ప్రధానమైన లోపం కాలువ డిజైనింగ్ లోనే కనిపిస్తోంది. ఇతర కాలువలకు భిన్నంగా ఈ 7బి డిస్ట్రిబ్యూటరీని ఏకంగా 9 నుంచి 12 మీటర్ల లోతు (డీప్ కట్) తవ్వాల్సి వచ్చింది. దీనివల్ల కాలువ లోపల నీరు ఉన్నా.. అది పక్కనే ఉన్న ఆయకట్టు భూములకు గ్రావిటీ ద్వారా సరఫరా అయ్యే పరిస్థితి లేకుండా పోయింది. గతేడాది వానకాలంలో ఎగువన ముక్కపల్లి చెరువు తెగిపోవడంతో వర్షపు నీరు కాలువలోకి చేరి, డీప్ కట్ వల్ల ఊట నీరు పైకి ఊరిందే తప్ప.. రైతులకు అందాల్సిన అసలైన కృష్ణా జలాలు మాత్రం చేరలేదు. దీనికి తోడు కాలువపై అక్కడక్కడా నిర్మించిన కొన్ని అశాస్త్రీయ కృత్రిమ నిర్మాణాలు నీటి ప్రవాహానికి అడ్డుకట్టగా మారాయి. ఈ డిస్ట్రిబ్యూటరీ పీఏ పల్లి మండల పరిధిలో 5 వేల ఎకరాలు, గుర్రంపోడు మండలంలో మరో 5 వేల ఎకరాలు.. మొత్తంగా 10 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందించాల్సి ఉంది. అయితే ఈ ప్రాజెక్ట్ పరిధి అంగడిపేట, గుర్రంపోడు డివిజన్ల పరిధిలో సగం సగం విస్తరించి ఉండటం అధికారులకు ఒక వంకగా మారింది. ఏ డివిజన్ అధికారులు కూడా పూర్తి బాధ్యత తీసుకోకపోవడంతో అధికారుల నిర్లక్ష్యానికి ఈ ప్రాంత రైతులు బలిపశువులవుతున్నారు.

అర్ధాంతరంగా నిలిచిన 3 కిలోమీటర్ల తవ్వకం

మైలాపురం నుంచి తానేదారిపల్లి వరకు కాలువ తవ్వకం జరగ్గా.. అక్కడి నుంచి తేనపల్లి చెరువు వరకు జరగాల్సిన మరో 3 కిలోమీటర్ల కాలువ పనుల ఊసే లేదు. తానేదారిపల్లి చెరువు ఎత్తును రెండు మీటర్లు పెంచి రిజర్వాయర్‌గా మారుస్తామని, ఆ తర్వాత గ్రావిటీ లెవల్‌ను బట్టి కొత్త డిజైన్‌తో ముందుకు వెళ్తామని చెప్పిన అధికారులు పనులను అర్ధాంతరంగా నిలిపివేశారు. గతంలో మంజూరైన నిధుల్లో ఇప్పటికీ రూ.5 కోట్ల నిధులు మిగిలి ఉన్నా.. పనులు ముందుకు సాగకపోవడం గమనార్హం. ఒకవేళ ఈ 3 కిలోమీటర్ల పనులు పూర్తయితే గుర్రంపోడు, తేనపల్లి పరిధిలో మరో 3 వేల ఎకరాలు అదనంగా సాగులోకి వచ్చే అవకాశం ఉంది.

పెండింగ్‌లోనే బ్రిడ్జిలు.. పెరగని భూగర్భ జలాలు..

కాలువ తవ్వకం వల్ల రైతులు తమ పొలాల్లోకి వెళ్లేందుకు వీలు లేకుండా పోయింది. రాకపోకల కోసం నిర్మించాల్సిన అంతర్గత బ్రిడ్జిల నిర్మాణం ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉంది. కాల్వలో నీరు పారక.. బ్రిడ్జిలు లేక రైతులు రెండు విధాలా నష్టపోతున్నారు. మిగిలి ఉన్న రూ.5 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేసి, నిలిచిపోయిన 3 కిలోమీటర్ల కాలువ పనులను పూర్తి చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. గుర్రంపోడ్, గుడిపల్లి వాగుల్లో నీటిని నిల్వ చేసేందుకు చిన్న తరహా రిజర్వాయర్లు నిర్మించాలి. దీనివల్ల భూగర్భ జలాలు నిలకడగా ఉండి, కాల్వ నీటితో సంబంధం లేకుండా బోరు బావుల ద్వారా అయిన రైతాంగానికి సాగునీటి కష్టాలు తీరే అవకాశం ఉంటుంది. డీప్ కట్ వల్ల నీరు అందని ప్రాంతాల్లో చిన్నపాటి లిఫ్ట్ మెకానిజం, ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ఆయకట్టుకు నీరు మళ్లించేలా రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు స్పందించి 7బి డిస్ట్రిబ్యూటరీ కాల్వలకు శాశ్వత మోక్షం కలిగించాలని, వేల ఎకరాలను సాగులోకి తెచ్చి రైతులకు ఆర్థిక భరోసా కల్పించాలని ఈ ప్రాంత రైతాంగం కోరుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>