కలం, వెబ్ డెస్క్ : ప్రకాశం జిల్లా కొండపి సమీపంలో శనివారం ఒక ఆర్టీసీ బస్సుకు తృటిలో పెద్ద ప్రమాదం (Kondapi Accident) తప్పింది. కొండపి – మద్దులూరు గ్రామాల మధ్య ఉన్న రొయ్యల ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి, ఒక పక్కకు వరిగి బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. అయితే, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
రోడ్డు మార్జిన్ చాలా తక్కువగా ఉండటం వల్లే బస్సు పక్కకు వరిగిపోయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను వెంటనే చికిత్స నిమిత్తం కొండపి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, జేసీబీ సహాయంతో బస్సును పక్కకు తొలగించి, నిలిచిపోయిన ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

