కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు (Pindiprolu) గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న చెన్న సుగుణమ్మ (60) అనే వృద్ధురాలిని గుర్తు తెలియని దుండగులు అత్యంత కిరాతకంగా గొంతు కోసి హత్య చేశారు. కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతూ మంచానికే పరిమితమైన భర్త జనార్దన్‌తో కలిసి ఆమె ఇంట్లోనే నివసిస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు సుగుణమ్మను హతమార్చి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను ఎత్తుకెళ్లినట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు.
పక్షవాతంతో బాధపడుతున్న భర్తను కంటికి రెప్పలా చూసుకుంటున్న సుగుణమ్మ ఇలా దారుణ హత్యకు గురికావడంతో పిండిప్రోలు గ్రామంలో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘోరం గురించి తెలుసుకున్న స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తును ముమ్మరం చేశారు.

