కలం, వలిగొండ: వలిగొండ మండలం సంగెం–బోలేపల్లి గ్రామాల ప్రజల దశాబ్దాల కల సాకారమయ్యే దిశగా అడుగులు పడ్డాయి. రెండు గ్రామాల మధ్య మూసీ నదిపై రూ.50 కోట్లతో నిర్మించనున్న ‘సంగెం హై లెవల్ బ్రిడ్జి’ నిర్మాణ పనులను భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (Kumbam Anil Kumar Reddy) అధికారికంగా ప్రారంభించారు. అంతకు ముందు ఎమ్మెల్యే భీమలింగం కట్ట వద్ద కొలువైన శివలింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, కొబ్బరికాయ కొట్టి నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
శాశ్వతంగా తీరునున్న రవాణా కష్టాలు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. దశాబ్దాలుగా వర్షాకాలంలో రాకపోకలు నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంగెం, బోలేపల్లి, పరిసర ప్రాంతాల ప్రజల కష్టాలు ఈ బ్రిడ్జి నిర్మాణంతో శాశ్వతంగా తీరిపోతాయన్నారు. బ్రిడ్జి నిర్మాణానికి రూ.50 కోట్లు మంజూరు చేస్తూ అనుమతులు ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, ప్రత్యేక చొరవ చూపిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.
పనులను ప్రస్తుతం ప్రారంభించినా, అధికారిక శంకుస్థాపన మహోత్సవాన్ని సీఎం చేతుల మీదుగా వైభవంగా నిర్వహిస్తామన్నారు. నిర్ణీత గడువులోనే పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ఈఈ సరితారాణితో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, వివిధ విభాగాల అధికారులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

