కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం చీకట్లను తరిమికొట్టి అంగన్వాడీ కేంద్రాల్లో వెలుగులు నింపుతోందని మంత్రి సీతక్క (Seethakka) పేర్కొన్నారు. రాష్ట్రంలో మొత్తం 35,781 అంగన్వాడీ కేంద్రాలు ఉండగా.. ప్రస్తుతం 32,109 కేంద్రాలకు ఉచిత కరెంట్ సదుపాయం అందుబాటులోకి వచ్చిందని ప్రకటించారు. దాదాపు 90 శాతం అంగన్వాడీ కేంద్రాలు (Anganwadi Centres) విద్యుత్ వెలుగులతో వెలుగొందుతున్నాయని తెలిపారు. మిగిలిన కేంద్రాలకు వీలైనంత త్వరగా విద్యుత్ సౌకర్యం కల్పించి నూరు శాతం విద్యుదీకరణ లక్ష్యాన్ని చేరుకుంటామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధితో రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో చీకట్లు తొలగిపోతున్నాయని చెప్పారు.
గత ప్రభుత్వ హాయంలో దాదాపు 40 శాతం అంగన్వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో చిన్నారులు, అంగన్వాడీ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీతక్క తెలిపారు. ఆ చీకట్లను తొలగించేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేసి.. అంగన్వాడీ కేంద్రాల్లో విద్యుత్ సౌకర్యం కల్పిస్తోందని అన్నారు. చిన్నారుల భవిష్యత్‌కు పునాది వేసేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ కనెక్షన్లు కల్పిస్తున్నారని చెప్పారు.
కేవలం గత ఆరు నెలల్లోనే 9,800 అంగన్వాడీ కేంద్రాలకు కొత్తగా విద్యుత్ సౌకర్యం కల్పించడం విశేషమని తెలిపారు. విద్యుత్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో సమీక్షలు నిర్వహించి. 11,194 కేంద్రాలకు నూతనంగా విద్యుత్ సదుపాయం కల్పించామని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అంగన్వాడీ సమస్యలను నిర్లక్ష్యం చేసిందని దుయ్యబట్టారు.

