కలం, ఖమ్మం బ్యూరో : సీతారామ ఎత్తిపోతల పథకంపై (Sita Rama Project) ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. కార్యాలయాలకే పరిమితం కాకుండా నేరుగా క్షేత్రస్థాయిలో ప్రాజెక్టు పనులను పరిశీలిస్తూ, పనుల వేగం పెంచేందుకు చర్యలు చేపడుతోంది.ఇందులో భాగంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గురువారం సత్తుపల్లి మండలం యాతాలకుంట గ్రామ పరిధిలో జరుగుతున్న సీతారామ ఎత్తిపోతల పథకం టన్నెల్ నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టు ప్రాంతంలోనే ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించి పనుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై అధికారులతో చర్చించారు.
యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాం: భట్టి విక్రమార్క
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ సీతారామ ఎత్తిపోతల పథకం పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గత పాలకులు ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచి ప్రజాధనాన్ని వృథా చేశారని ఆరోపించారు. సుమారు రూ.8,500 కోట్లు ఖర్చు చేసినప్పటికీ ఒక్క ఎకరానికి కూడా నీరు అందించలేకపోయారని విమర్శించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని తమ ప్రభుత్వం ఇప్పటికే ప్రాజెక్టుకు రూ.1,000 కోట్ల బిల్లులు విడుదల చేసి పనులను ముందుకు తీసుకెళ్తోందని అన్నారు. భూసేకరణ పనులను వేగవంతం చేసేందుకు తక్షణమే రూ.135 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన బిల్లులు సిద్ధం చేసి టోకెన్లు పంపాలని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
ప్రతి ఎకరాకు గోదావరి జలాలు అందిస్తాం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రతి సాగుభూమికి గోదావరి జలాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. సీతారామ ప్రాజెక్టుకు అవసరమైన 67 టీఎంసీల నీటి వినియోగానికి కేంద్ర జల సంఘం నుంచి తుది అనుమతులు సాధించడం తమ ప్రభుత్వ ఘనత అని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో పర్యావరణ అనుమతులు లేకుండా ప్రారంభించిన సీతమ్మసాగర్ ప్రాజెక్టును కూడా న్యాయపరమైన సమస్యలను పరిష్కరించి చట్టబద్ధంగా పూర్తి చేస్తామని తెలిపారు. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులను జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు శాస్త్రీయంగా చేపడుతున్నామని స్పష్టం చేశారు.
పెండింగ్ పనులను పూర్తి చేస్తాం: పొంగులేటి
రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన పనులను ఎలాంటి బేషజాలు లేకుండా పూర్తి చేస్తున్నామని తెలిపారు. ఏన్కూర్ లింక్ కెనాల్ ద్వారా కరువు కాలంలోనూ 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు దివాకర టీఎస్, అంకిత్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్, సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

