కలం, నిజామాబాద్ బ్యూరో : తెలంగాణ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 19న హైదరాబాద్‌లోని కాప్రా మల్లారెడ్డి గార్డెన్స్‌లో నిర్వహించనున్న.. ప్రతిష్టాత్మక బ్లాక్ బెల్ట్ డాన్ ప్రమోషన్ టెస్ట్‌కు నిజామాబాద్ (Nizamabad) జిల్లా నుంచి 22 మంది తైక్వాండో (Taekwondo) క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అమేచ్యూర్ తైక్వాండో అసోసియేషన్–నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, తైక్వాండో కోచ్ జె.సి. మనోజ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో క్రీడాకారులు ఈ ప్రతిష్టాత్మక పరీక్షకు ఎంపిక కావడం గర్వకారణమని తెలిపారు. క్రీడాకారులు క్రమశిక్షణతో శిక్షణ పొంది అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని, డాన్ ప్రమోషన్ టెస్ట్‌లోనూ విజయవంతంగా రాణిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమానికి అమేచ్యూర్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు బస్వా లక్ష్మీ నరసయ్య ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్లుగా బస్వా గార్డెన్‌లో నిర్వహిస్తున్న తైక్వాండో (Taekwondo) శిక్షణ ద్వారా వందలాది మంది విద్యార్థులు బ్లాక్ బెల్ట్‌లు సాధించారని తెలిపారు. తైక్వాండో శిక్షణ పొందిన వారిలో పలువురు నేడు ఇంజనీర్‌లు , వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, ఇతర ఉన్నత వృత్తుల్లో స్థిరపడి సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందారని పేర్కొన్నారు. బ్లాక్ బెల్ట్ అనేది కేవలం సర్టిఫికెట్ కాదని, అది క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, ఆత్మరక్షణ నైపుణ్యాలకు ప్రతీక అని అన్నారు.
విద్యార్థులు క్రీడలతో పాటు చదువులోనూ రాణిస్తూ ఉన్నత లక్ష్యాలను చేరుకోవడానికి కృషి చేయాలని సూచించారు. అదే విధంగా నిజామాబాద్ జిల్లాలో తైక్వాండో అభివృద్ధికి కృషి చేస్తున్న కోచ్ జె.సి. మనోజ్ కుమార్ సేవలను అభినందించారు. ప్రతిరోజూ బస్వా గార్డెన్‌లో విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ అందిస్తూ వారి శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణను పెంపొందిస్తున్నారని కొనియాడారు.
Read Also: తెలంగాణలో తీవ్రంగా కరెంట్ కోతలు: హరీశ్ రావు
Follow Us On : WhatsApp

