కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన శుక్రవారం తెలంగాణ కేబినెట్ (Telangana Cabinet) భేటీ జరుగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ఈ సమావేశం జరుగనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ సంజయ్ జాజు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి నెలా రెండుసార్లు కేబినెట్ భేటీ జరపాలనే ఆనవాయితీ కొనసాగుతున్నది. ఈసారి జరిగే మంత్రివర్గ సమావేశంలో పలు సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తి చేసేందుకు వీలుగా అంచనా వ్యయాలను సవరించడంపై చర్చ జరిగే అవకాశమున్నది.
ఇప్పటికే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం ముఖ్యమంత్రితో ఈ అంశాన్ని చర్చించిన తర్వాత నెక్స్ట్ క్యాబినెట్ మీటింగ్‌లో దీన్ని ఎజెండా ఐటెమ్‌గా పెట్టాలని సూచించినట్లు తెలిసింది. దీనికి తోడు గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్లో కొన్నింటిని రాటిఫై చేయడంపైనా ఎజెండాలో లిస్ట్ అయ్యే అవకాశమున్నది. ప్రస్తుతం ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం తక్కువ నమోదు కావచ్చనే వాతావరణశాఖ అంచనాలు, కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని లిఫ్ట్ చేయాలని విపక్షాల నుంచి వస్తున్న డిమాండ్లు, ఎన్డీఎస్ఏ ఆంక్షలు.. వీటిపైన కూడా మంత్రివర్గ భేటీలో చర్చకు వచ్చే అవకాశమున్నది.
వచ్చే వారం మహారాష్ట్ర సీఎంతో మీటింగ్?
గోదావరి జలాల వినియోగం, తుమ్మిడిహెట్టి దగ్గర తెలంగాణ ప్రభుత్వం నిర్మించాలనుకుంటున్న బ్యారేజీ ఎత్తు విషయంలో మహారాష్ట్రతో తలెత్తిన విభేదాలు.. వీటిపై చర్చించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో వచ్చేవారం మీటింగ్ జరగనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ భేటీ కోసం ఆ రాష్ట్ర సీఎంకు లేఖ రాశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి సైతం లేఖ రాసి చొరవ తీసుకోవాలని కోరారు. ఈ పరిస్థితుల్లో వచ్చే వారం తేదీ ఫిక్స్ అయ్యే అవకాశమున్నది. కేంద్ర జల వనరుల శాఖలోని ఒకరు ఇప్పటికే మహారాష్ట్ర సీఎంతో మాట్లాడి మీటింగ్ ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చకు వచ్చే అంశాలు, తీసుకునే నిర్ణయాలు కీలకం కానున్నాయి. తుమ్మిడిహెట్టి బ్యారేజీని 150 లేదా 152 మీటర్ల ఎత్తులో కడితే మహారాష్ట్రలో ముంపు ప్రాంతానికి తగిన పరిహారం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. దీంతో ఈ చర్చల్లో దీనిపై ఏకాభిప్రాయం వచ్చి విధాన నిర్ణయం జరగొచ్చని సమాచారం.

