కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో కరెంట్ కోతలు తీవ్రంగా ఉన్నాయని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. 11 జిల్లాల్లో సబ్ స్టేషన్ల ఎదుట రైతులు ధర్నా చేశారని వివరించారు.
థర్మల్ విద్యుత్తు కేంద్రాల్లో బొగ్గు అందుబాటులో లేకపోవడమే కరెంట్ కోతలకు కారణమైందన్నారు. ఇది ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ల్యమన్నారు. కనీసం వారం రోజులకు సరిపడా నిల్వలు కూడా లేవన్నారు. ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని నిద్రలేపినా.. లాభం లేకుండా పోయిందన్నారు.
60 శాతం యూనిట్ల మూసివేత..
రాష్ట్రంలోని కాకతీయ, సింగరేణి, భద్రాద్రి పవర్ ప్లాంట్లలో 60 శాతం యూనిట్లలో విద్యుత్తు నిలిచిపోయిందని హరీశ్ రావు ఆరోపించారు. యాదాద్రి ప్లాంటులో ఒకటి, నాలుగు యూనిట్లను పూర్తిగా బంద్ పెట్టారని మండిపడ్డారు. తద్వారా 16 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిందన్నారు. భద్రాద్రిలో 270 మెగావాట్ల నిలిచిపోయిందన్నారు.
తెలంగాణ థర్మల్ విద్యుత్తు స్థాపిత సామర్థ్యం 7,180 మెగా వాట్లు కాగా, నిన్న ఉత్పత్తి అయింది కేవలం 3,190 వేల మెగావాట్లు మాత్రమేనని హరీశ్ రావు అన్నారు. అంటే సగం కూడా ఉత్పత్తి చేయడం లేదన్నారు. అందుకే, రాష్ట్రంలో ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ పోతోందన్నారు.
8 గంటలు ఇవ్వడం లేదు..
వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంట్ అని ఊదరగొడుతున్నారని.. కనీసం 8 గంటలు కూడా ఇవ్వడం లేదని హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కరెంట్, బొగ్గు శాఖలను భట్టి విక్రమార్కనే నిర్వహిస్తున్నారని.. ఒక్క సారైనా సమీక్ష చేశారా.. అని ప్రశ్నించారు. కొన్ని ప్రాంతాల్లో ఆరు గంటలు కూడా ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారని.. విద్యుత్తు అధికారులను అడిగితే ఎవరు పట్టించుకోవడం లేదన్నారు.
వినియోగదారులపై తీవ్ర భారం..
రాష్ట్రంలోని బొగ్గు ఉత్పత్తిని బంద్ పెట్టిన ప్రభుత్వం.. బహిరంగ మార్కెట్లో రోజుకు 80 మిలియన్ యూనిట్ల కరెంటుని కొనుగోలు చేస్తోందని హరీశ్ రావు విమర్శించారు. ఇందుకు భారీగా నిధులు వెచ్చిస్తోందని.. ఇది అంతిమంగా వినియోగదారులపై భారంగా మారుతోందన్నారు.
నైనీ, సింగరేణి బ్లాక్‌ల్లో అత్యంత నాణ్యమైన బొగ్గును ఏపీ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలకు పంపిస్తున్నారని, తెలంగాణకు మాత్రం నాసిరకమైన బొగ్గు సరఫరా చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఆ బొగ్గు కరెంట్ ఉత్పత్తికి ఏమాత్రం అనువు కాదన్నారు.

