కలం, వెబ్ డెస్క్: ఆడుతూ పాడుతూ గడపాల్సిన ఆ చిన్నారి జీవితం ఒక చిన్న పెన్సిల్ రూపంలో వచ్చిన ప్రమాదంతో అర్ధాంతరంగా ముగిసిపోయింది. ఖమ్మం(Khammam) జిల్లా కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో బుధవారం విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. పెన్సిల్ గుచ్చుకోవడంతో ఆరేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
ఖమ్మం (Khammam) జిల్లా నాయకన్‌గూడెం గ్రామానికి చెందిన విహార్ (6) స్థానిక ప్రైవేటు పాఠశాలలో యూకేజీ చదువుతున్నాడు. బుధవారం ఉదయం యధావిధిగా బడికి వెళ్లిన విహార్, తన పెన్సిల్‌ను చొక్కా జేబులో ఉంచుకున్నాడు. స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి బోర్లా పడిపోయాడు. దురదృష్టవశాత్తూ జేబులోని పెన్సిల్ మొన పైకి ఉండటంతో, పడిన వేగానికి అది బలంగా ఛాతిలోకి దిగింది.
తీవ్రమైన గాయం కావడంతో విహార్ విలవిలలాడిపోయాడు. పెన్సిల్ గుచ్చుకున్న చోట నుంచి రక్తస్రావం ఎక్కువగా కావడంతో బాలుడు స్పృహ కోల్పోయాడు. వెంటనే స్పందించిన పాఠశాల సిబ్బంది, స్థానికులు కలిసి బాలుడిని చికిత్స కోసం కూసుమంచి ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే మార్గమధ్యలోనే విహార్ కన్నుమూశాడు. కళ్ల ముందే ఆడుకుంటూ వెళ్లిన కుమారుడు శవమై తిరిగి రావడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


