కలం డెస్క్ : తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు (Telangana Assembly Winter Session) ఈ నెల 29న ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. కేవలం ఒక్క రోజుతోనే ఈ సెషన్ ముగిసే అవకాశాలున్నాయి. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్సుల స్థానంలో బిల్లుల్ని ప్రవేశపెట్టి చర్చల అనంతరం ఆమోదం పొందేలా ఈ సమావేశాలు జరగనున్నాయి. ఎంత పొద్దుపోయినా, అర్ధరాత్రి అయినా ఆ రోజునే అన్ని ఆర్డినెన్సులకు ఆమోదం పొందేలా చూసుకోవాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. వీటికి ప్రాధాన్యత ఇచ్చి ఆ తర్వాత కృష్ణా, గోదావరి జలాలపై చర్చను మొదలుపెట్టవచ్చని ప్రాథమిక సమాచారం. ఆ రోజు లాంఛనంగా ప్రారంభం కావడంతో పాటు అన్ని బిల్లులకు ఆమోదం లభించిన వెంటనే నిరవధికంగా వాయిదా పడే అవకాశమున్నది. ప్రతిపక్షాల నుంచి ఒత్తిడి పెరిగితే జనవరి 2వ తేదీన నిర్వహించడంపై ప్రభుత్వం అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయి.
సెషన్‌పై వరుస సెలవుల ఎఫెక్ట్ :
కృష్ణా, గోదావరి జలాలపై కేసీఆర్ చేసిన ఆరోపణలను తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) వేదికగా తిప్పికొట్టనున్నట్లు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా పలువురు మంత్రులు ఇప్పటికే వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం అసెంబ్లీలో జరిగే చర్చకు కేసీఆర్ రావాలంటూ డిమాండ్ చేశారు. దీంతో నదీ జలాల అంశంపై ఏ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగిందో సీఎం, ఇరిగేషన్ మంత్రి వివరించే అవకాశమున్నది. కానీ ఈ నెల 29న అసెంబ్లీ సెషన్ ప్రారంభమైనా ఆ తర్వాత మూడు రోజుల పాటు సెలవులుంటాయి. ఈ నెల 30న వైకుంఠ ఏకాదశి, ఆ తర్వాతి రోజు డిసెంబరు 31 ఇయర్ ఎండింగ్, ఆ మరుసటి రోజు (జనవరి 1) న్యూ ఇయర్.. వరుస సంబురాలతో ఎమ్మెల్యేలంతా ఆలయ దర్శనాలు, నియోజకవర్గాల ప్రజలకు విషెస్ చెప్పే హడావిడిలో మునిగిపోనున్నారు. దీంతో అసెంబ్లీకి రాకపోవచ్చని మూడు రోజులు అసెంబ్లీ సెషన్‌కు హాలీడేస్ ఉండే అవకాశమున్నది.
ఆర్డినెన్సులకు ఆమోదమే ప్రయారిటీ :
అసెంబ్లీ వింటర్ సెషన్‌ను జనవరి 2 నుంచి మూడు రోజుల పాటు కొనసాగించే అవకాశమున్నట్లు తొలుత లీకులు వచ్చినా ప్రభుత్వ ప్రయారిటీ మాత్రం ఆర్డినెన్సుల స్థానంలో ప్రవేశపెట్టే బిల్లులకు ఆమోదం పొందడమేనని తెలిసింది. దీనికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఎన్ని గంటల పాటు చర్చ జరిగినా డిసెంబరు 29ననే ముగించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. నదీ జలాల అంశంపై అసెంబ్లీలో చర్చకు కేసీఆర్ సిద్ధమేనా అని సీఎం రేవంత్‌రెడ్డి సవాలు విసిరిన నేపథ్యంలో ఈ నెల 29న జరిగే సెషన్‌కు ఆయన హాజరయ్యే అంశానికి అనుగుణంగా జనవరి 2 నుంచి తిరిగి కొనసాగించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశమున్నది.
Read Also: శివధర్‌రెడ్డి స్థానంలో కొత్త డీజీపీ? నయా జాబితాపై ఉత్కంఠ!!
Follow Us On: Instagram


