కలం, వనపర్తి: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) కొత్తకోట పర్యటనను వనపర్తి జిల్లా పోలీసులు (Wanaparthy Police) కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో విజయవంతంగా నిర్వహించారు. జోగులాంబ జోన్-7 డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ సునితా రెడ్డి నేతృత్వంలో 850 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో బహుళస్థాయి భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు, రూట్‌లైనింగ్ నుంచి ట్రాఫిక్ నియంత్రణ వరకు ప్రతి అంశాన్ని పకడ్బందీగా అమలు చేయడంతో పర్యటన ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా ముగిసింది.
భద్రతా ఏర్పాట్లను ఎస్పీ సునితా రెడ్డి స్వయంగా నిరంతరం పర్యవేక్షిస్తూ, వివిధ విభాగాల అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ఆమె వ్యూహాత్మక ప్రణాళిక, సమర్థవంతమైన సమన్వయంతో పోలీసు యంత్రాంగం సమష్టిగా పనిచేసి పర్యటనను విజయవంతం చేసింది. ముఖ్యమంత్రికి జోగులాంబ జోన్-7 డీఐజీ ఎల్.ఎస్. చౌహాన్, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునితా రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు ఘన స్వాగతం పలికారు.
కార్యక్రమం ముగిసిన అనంతరం ఎస్పీ బందోబస్తులో పాల్గొన్న ప్రతి పోలీసు అధికారి, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. “ప్రతి పోలీసు అధికారి, సిబ్బంది కర్తవ్య నిబద్ధత, అప్రమత్తత, క్రమశిక్షణతో పనిచేయడం వల్లే ముఖ్యమంత్రి పర్యటన విజయవంతమైంది. ఇదే సేవాస్ఫూర్తితో ప్రజలకు మరింత మెరుగైన పోలీసు సేవలు అందించాలి” అని ఎస్పీ సునితా రెడ్డి పేర్కొన్నారు.
Read Also: అవినీతిపై ఉక్కుపాదం.. అధికారులకు సీఎం విజయ్ వార్నింగ్
Follow Us On: Sharechat

