epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

శివధర్‌రెడ్డి స్థానంలో కొత్త డీజీపీ? నయా జాబితాపై ఉత్కంఠ!!

కలం, వెబ్‌డెస్క్ : ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా ఉన్న శివధర్‌రెడ్డి (Telangana DGP Shivadhar Reddy) అదే పోస్టులో కొనసాగుతారా? యూపీఎస్సీ గైడ్‌లైన్స్ (UPSC Guidelines) అందుకు ఒప్పుకుంటాయా?.. ఆయన స్థానంలో కొత్త డీజీపీ రాక తప్పదా? ఇందుకోసం కొత్త పేర్లతో మరో ప్యానెల్‌ను రాష్ట్ర సర్కారు పంపనున్నదా?.. అందులో శివధర్‌రెడ్డి పేరు ఉండకపోవచ్చా? ఇలాంటి అనేక సందేహాలు తెరమీదకు వచ్చాయి. హైకోర్టులో పిటిషన్ విచారణ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పంపే ప్యానెల్‌లో (Panel) ఎవరి పేర్లు ఉంటాయనేది ఆసక్తికరంగా మారింది. డీజీపీల నియామకంపై సుప్రీంకోర్టు గతంలో వెల్లడించిన ఆదేశాలు, యూపీఎస్సీ మార్గదర్శకాలు శివధర్‌రెడ్డి నియామకానికి ఇబ్బందికరంగా మారాయి. రెండు వారాల్లో కొత్త లిస్టును యూపీఎస్సీకి పంపనున్న నేపథ్యంలో తదుపరి డీజీపీగా ఎవరికి చాన్స్ ఉంటుందనే చర్చ మొదలైంది.

నాలుగు నెలలే పదవీకాలం :

యూపీఎస్సీ గైడ్‌లైన్స్ ప్రకారం ఒక రాష్ట్రానికి పూర్తిస్థాయి డీజీపీ కావాలంటే కనీసంగా ఆరు నెలల పదవీకాలం తప్పనిసరి. కానీ ప్రస్తుతం తెలంగాణ డీజీపీగా ఉన్న శివధర్‌రెడ్డి (Telangana DGP Shivadhar Reddy) వచ్చే ఏడాది ఏప్రిల్ 30న రిటైర్ కానున్నారు. అంటే, ఇంకో నాలుగు నెలలు మాత్రమే పదవిలో కొనసాగుతారు. యూపీఎస్సీ గైడ్‌లైన్స్ కు ఈ నాలుగు నెలల పదవీకాలం సరిపోదు. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాల్లో పంపే జాబితాలో ఆయన పేరు ఉండకపోవచ్చనే మాటలు సచివాలయవర్గాల్లో వినిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన పేరు పంపినా యూపీఎస్సీ పరిగణనలోకి తీసుకోకపోవచ్చని, పైగా గైడ్‌లైన్స్ కు విరుద్ధంగా ఆయన పేరు ఎలా చేరుస్తారనే ఎదురు ప్రశ్న కూడా తలెత్తే అవకాశమున్నదనేది ఆ వర్గాల వాదన.

కొత్త లిస్టులో శివధర్‌రెడ్డి పేరుంటుందా? :

శివధర్‌రెడ్డిని డీజీపీగా నియమించడానికి ముందే యూపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ అధికారుల పేర్లతో ప్యానెల్ లిస్టును పంపింది. అందులో ఆయనతో పాటు సీవీ ఆనంద్, శిఖాగోయల్, సౌమ్యా మిశ్రా, రవి గుప్త, కొత్తకోట శ్రీనివాసరెడ్డి పేర్లు ఉన్నాయి. ఇందులో రవిగుప్త, కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఇప్పటికే రిటైర్ అయ్యారు. జితేందర్ సైతం రిటైర్ అయ్యారు. మిగిలినవారు సర్వీసులోనే ఉన్నారు. తెలంగాణ హైకోర్టు తాజాగా బుధవారం ఇచ్చిన ఆదేశం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం రెండు వారాల్లో యూపీఎస్సీకి డీజీపీగా నియమితులు కావడానికి అర్హులైన సీనియర్ ఆఫీసర్ల పేర్లను పంపాల్సి ఉన్నది. కేవలం నాలుగు నెలల పదవీకాలం మాత్రమే ఉండడంతో శివధర్‌రెడ్డి పేరు ఉంటుందా?.. ఉండదా?.. అనే సస్పెన్స్ నెలకొన్నది. మిగిలినవారు (సీవీ ఆనంద్, శిఖాగోయల్, సౌమ్యామిశ్రా) ఇంకా సర్వీసులోనే ఉన్నారు.

యూపీఎస్సీ కొర్రీలకు సర్కార్ వివరణ :

శివధర్‌రెడ్డి నియామకానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితాపై యూపీఎస్సీ అభ్యంతరాలను వ్యక్తం చేసి, వాటికి క్లారిఫికేషన్ ఇవ్వాలని కోరింది. తెలంగాణ రాష్ట్ర కేడర్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ వినాయక్ ప్రభాకర్ ఆప్టే పేరును ఎందుకు పెట్టలేదని ప్రశ్నించింది. ఏపీ కేడర్‌గా ఉన్న అభిలాష భిష్ట్ తెలంగాణలో పనిచేస్తున్నందున ఆమె పేరును జాబితాలో పెట్టాలా… వద్దా.. అని కూడా యూపీఎస్సీ అభిప్రాయాన్ని రాష్ట్ర సర్కార్ కోరింది. కానీ అందుకు యూపీఎస్సీ ‘నో’ అనే సమాధానమిచ్చింది. వినాయక్ ప్రభాకర్ ఆప్టే తెలంగాణ కేడర్ ఆఫీసర్ అయినా ఎన్నడూ ఇక్కడ పనిచేయలేదని, కేంద్ర సర్వీసుల్లో (ఇంటెలిజెన్స్ బ్యూరో) ఉన్నందున ఆయన పేరును పెట్టలేదని తెలంగాణ వివరణ ఇచ్చింది. అయినా ఆయన తెలంగాణ కేడర్‌గా ఉన్నందున పేరు ఉండాల్సిందేనని యూపీఎస్సీ నొక్కిచెప్పినట్లు సచివాలయ వర్గాలు ఉదహరించాయి.

రాష్ట్రం పంపే కొత్త జాబితాపై సస్పెన్స్ :

శివధర్‌రెడ్డిని డీజీపీగా నియమించడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా రెండు వారాల్లో తెలంగాణ ప్రభుత్వం జాబితాను యూపీఎస్సీకి పంపాల్సి ఉన్నది. సీనియారిటీ ప్రకారం చూస్తే సీవీ ఆనంద్ (1991 బ్యాచ్) అందరికంటే సీనియర్. ఆ తర్వాత 1994 బ్యాచ్‌కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, శిఖాగోయల్, సౌమ్యా మిశ్రా తదితరులు ఉంటారు. కొత్తగా పంపే ప్యానెల్‌లో మరోమారు శివధర్‌రెడ్డి పేరును తెలంగాణ పెడుతుందా?.. లేక కొత్త జాబితాగా ఆయన పేరును తీసేసి మిగిలినవారితోనే సరిపెడుతుందా?.. అనేది ఆసక్తికరంగా మారింది. శివధర్‌రెడ్డి పేరు పెడితే యూపీఎస్సీ ‘ఆరు నెలల కనీస సర్వీసు’ నిబంధనను ఉల్లంఘించినట్లవుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. యూపీఎస్సీ మరోమారు కొర్రీ వేసే అవకాశాలున్నాయని గుర్తుచేసింది. ఇలాంటి పరిస్థితుల్ల రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కీలకంగా మారింది. ఫుల్‌టైమ్ డీజీపీగా ఎవరు ఫైనల్ అవుతారనే చర్చ మొదలైంది.

Read Also: సెంచరీలతో చెలరేగిన రోకో

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>