కలం, ఖమ్మం బ్యూరో: ఉప ముఖ్యమంత్రి, మంత్రుల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన ‘ఛలో మణుగూరు’ (Chalo Manuguru Protest) కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడటాన్ని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర (Vaddiraju Ravi Chandra) తీవ్రంగా ఖండించారు.
రైతుల సమస్యలపై ప్రతిపక్షాలు నిలదీస్తాయనే భయంతోనే ప్రభుత్వం పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించేవారిని అరెస్టులతో భయపెట్టాలని చూడటం అవివేకమని, ఈ చర్యలు తమలో పోరాట పటిమను మరింత పెంచుతాయని హెచ్చరించారు.
మరోవైపు, నిరసనకు సిద్ధమైన అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు (Mecha Nageswara Rao) ను దమ్మపేట మండలంలోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిది ప్రజా పాలన కాదు రాక్షస పాలన అని మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగితే పోలీసులతో అడ్డుకోవడం కాంగ్రెస్ పిరికిపంద చర్య అని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రికి రాజ్యాంగంపై కంటే లాఠీలపైనే నమ్మకం ఎక్కువని, ఎన్ని అరెస్టులు చేసినా ప్రజల పక్షాన పోరాటం ఆపేది లేదని స్పష్టం చేశారు. పోలీసులు తక్షణమే అక్రమ అరెస్టులను ఆపి, నిర్బంధించిన బీఆర్ఎస్ నాయకులను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.

