కలం, మెదక్ బ్యూరో : ప్రకృతి ప్రేమికులను, ప్రయాణికులను సరికొత్త లోకంలోకి తీసుకెళ్లేందుకు సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో తెలంగాణ అటవీ శాఖ అధ్వర్యంలో సరికొత్త హరిత హంగులతో మూడు పార్కులు అందుబాటులోకి వచ్చాయి. కాంక్రీట్ జంగిల్‌కు దూరంగా, ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే వారి కోసం వేలాది ఎకరాల నర్సాపూర్ అటవీ అందాలను కళ్లకు కట్టేలా అద్భుతమైన ఫారెస్ట్ పార్కులు రూపుదిద్దుకున్నాయి. ప్రయాణ అలసటను మరచిపోయేలా చేసి, ఎర్రటి నేలలు, పచ్చని వన సంపదను చూసేందుకు జహీరాబాద్ పట్టణ శివారులోని ‘త్రివేణి వనం’ ఎకో పార్కు సందర్శకులను అకర్షించనుంది.
జహీరాబాద్ ‘త్రివేణి వనం’
జహీరాబాద్ పట్టణ శివారులో హైదరాబాద్-ముంబై జాతీయ రహదారి పక్కన, మహీంద్రా కంపెనీ సమీపంలో 200 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ‘త్రివేణి వనం’ పేరుతో అర్బన్ ఫారెస్ట్ పార్కును నిర్మించారు. సుమారు 4 కోట్ల అంచనా వ్యయంతో ఈ పార్క్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అటవీ ప్రాంతాన్ని కాపాడుతూనే, జహీరాబాద్ పట్టణ ప్రజలకు అహ్లదం కల్పించేందుకు ఈ పార్కును అభివృద్ధి చేశారు.
పార్కు ఎంట్రెన్స్ వద్ద అందర్ని ఆకట్టుకునేలా ప్రధాన ముఖద్వారం, అందాల అటవీ మధ్యలో గజెబో, వాచ్ టవర్ల నిర్మాణం పూర్తి చేశారు. వాచ్ టవర్ పైకి నుండి చుట్టుపక్కల ప్రకృతి అందాలను అస్వాదించవచ్చు. సందర్శకులు సేద తీరేందుకు నాలుగు రచ్చ బండలు, అటవీ జంతువుల దాహం తీర్చడంతో పాటు ప్రజల అవసరాల కోసం సోలార్‌తో నడిచే బోరు బావులను తవ్వించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో నడిచేందుకు 5 కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్ అందుబాటులో ఉన్నది. ప్రశాంత వాతవరణంలో యోగాను ఏకకాలంలో 50 నుంచి 80 మంది ధ్యానం చేసుకునేలా రెండు విశాలమైన యోగా షెడ్లతో ధ్యాన మందిరం, పిల్లలను ఆకట్టుకునేలా ప్రత్యేకంగా చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉన్నది. జహీరాబాద్ ప్రాంత ప్రజలకు పర్యాటక ప్రాంతంగా త్రివేణి వనంలో గజెబో కట్టడం, వాచ్ టవర్ల ,ధ్యాన మందిరం, చిన్న పిల్లల ఆటస్థలం, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. హరిత నిధి పథకంలో నిధులతో ఈ పార్కును సకల సౌకర్యాలతో తీర్చిదిద్దారు.
అడవి అందాల పార్కులు
ప్రఖ్యాత నర్సాపూర్ అటవీ ప్రాంతంలోని వన సంపదను ,అహ్లదకరమైన వాతవరణంలో పర్యాటకులు ప్రశాంతంగా గడిపే విధంగా అమృతవనం , హరిత ద్వారం పేరుతో రెండు పార్కులు కూడా సంగారెడ్డి జిల్లాలో ఇటీవల ప్రారంభమైనవి. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం బొంతపల్లి అటవి ప్రాంతం లో అమృతవనం ఎకో ఫారెస్ట్ పార్కును రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. దుండిగల్ ఓఆర్ఆర్ నుండి కేవలం 12 కిలోమీటర్ల దూరంలో 4,343 ఎకరాల పచ్చని రిజర్వ్ అటవీ ప్రాంతంలో 781 ఎకరాల్లో ఎకో పార్కును అటవీ శాఖ అభివృద్ధి చేసింది.
ఇందులో భాగంగా రెండు కిలోమిటర్ల వాకింగ్ ట్రాక్ , రెండు కిలోమీటర్ల సైక్లింగ్ ట్రాక్ , ఆరు కిలోమీటర్ల నేచర్ ట్రయిల్స్ ను తయారు చేశారు. అంతేకాకుండా పిల్లల కోసం ప్రత్యేకంగా చిల్డ్రన్స్ పార్కు, మానసిక ప్రశాంతత కోసం వచ్చే వారి కోసం ప్రకృతి ఒడిలో యోగా ,మెడిటెషన్ చేసుకునే విధంగా మెడిటేషన్ సెంటర్, అటవీ ప్రాంత అందాలను వీక్షించేందుకు వాచ్ టవర్ , అలాగే రిక్రియేషన్ సదుపాయలు కల్పించారు.
ఓఆర్ఆర్ దుండిగల్ నుండి కేవలం 15 కిలోమీటర్ల దూరంలో మంబాపూర్ లో రాష్ట్ర ప్రభుత్వం హరిత ద్వారం పేరుతో మరో పార్కును అభివృద్ధి చేసింది. 2,545 ఎకరాల పచ్చని రిజర్వ్ అటవీ ప్రాంతంలో 1,777 ఎకరాల్లో ఐదు కోట్ల రుపాయలతో హరిత ద్వారం పార్కును అటవీ శాఖ అభివృద్ధి చేసింది. ఇందులో భాగంగా రెండు కిలోమీటర్ల మేర వాకింగ్ ట్రాక్ , సైక్లింగ్ ట్రాక్ , నాలుగు కిలోమీటర్ల నేచర్ ట్రయిల్స్ ను తయారు చేశారు. అటవీ ప్రాంతంలో నేచర్ ట్రయిల్స్ లో భాగంగా జీప్ లో ప్రయాణం చేసే అవకాశం కల్పించారు. ఓఆర్ఆర్‌కు దగ్గర ఉన్న ఈ పార్కులు హైదరాబాద్ మహానగర ప్రజలకు పచ్చని అటవీ అందాలతో ప్రకృతిని దగ్గర చేయనున్నాయి.

