గుడ్ న్యూస్.. అంగన్‌వాడీల్లో వెలుగుల విప్లవం!

కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణ అంగన్‌వాడీ (Telangana Anganwadi) కేంద్రాల్లో చీకట్లు తొలగిపోతున్నాయి. చిన్నారుల భవిష్యత్‌కు పునాది వేసే ఈ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం ఉచిత విద్యుత్ కనెక్షన్ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క (Minister Seethakka) ప్రత్యేకంగా చొరవ తీసుకుని విద్యుత్ శాఖతో నిరంతరం జరిపిన సంప్రదింపులతో రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలకు ఉచిత విద్యుత్ సాకారమవుతున్నది. గడచిన ఆరు నెలల్లోనే 9,800 అంగన్‌వాడీ కేంద్రాలకు కొత్త విద్యుత్ కనెక్షన్లు వచ్చాయని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

రాష్ట్రంలోని మొత్తం 35,781 అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రస్తుతం 32,109 చోట్ల విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిందని, దాదాపు 90% లక్ష్యం నెరవేరిందని పేర్కొన్నది. మిగిలిన కేంద్రాలకూ త్వరలోనే కనెక్షన్లు కల్పించి నూరు శాతం లక్ష్యాన్ని చేరుకోనున్నట్లు తెలిపింది. గత ప్రభుత్వంలో 40% అంగన్‌వాడీ కేంద్రాలకు విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో చిన్నారులు, అంగన్‌వాడీ కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, లైట్లు, ఫ్యాన్లు లేక చీకటి గదుల్లోనే నడిచాయని గుర్తుచేసింది. వేసవిలో ఉక్కపోత కారణంగా చిన్నారులను కేంద్రాల్లో ఉంచడం కష్టంగా మారేదని, కరెంటు లేకపోవడంతో డిజిటల్ బోధన, ఆధునిక విద్యా విధానాల అమలు కూడా సాధ్యపడేది కాదని వివరించింది.

ప్రభుత్వ విద్యాసంస్థలకు అమలవుతున్న ఉచిత విద్యుత్ విధానాన్ని అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా వర్తింపజేయాలని ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లిన మంత్రి సీతక్క, చిన్నారుల సంక్షేమానికి సంబంధించిన అంశంగా దీనిపై సానుకూల నిర్ణయం రావడానికి చొరవ తీసుకున్నారు. పెండింగ్‌లో ఉన్న కనెక్షన్లను గుర్తించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. మొత్తం 11,194 కేంద్రాలకు కొత్తగా విద్యుత్ సదుపాయం కల్పించగా, అందులో గడచిన ఆరు నెలల్లోనే 9,800 కేంద్రాలకు విద్యుత్ వెలుగులు వచ్చాయని ఆ శాఖ విడుదల చేసిన ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది.

“బలమైన భవిష్యత్‌కు బాల్యమే పునాది. చిన్నారులు సురక్షితమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎదగాలి. అంగన్‌వాడీ కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత. మిగిలిన కేంద్రాలకూ త్వరలోనే విద్యుత్ సౌకర్యం కల్పించి రాష్ట్రంలోని ప్రతి అంగన్‌వాడీని విద్యుత్ వెలుగులతో నింపుతాం” అని మంత్రి సీతక్క ఆ ప్రకటనలో వివరించారు. గత ప్రభుత్వం ‘బంగారు తెలంగాణ’ పేరుతో ప్రచారం చేసుకుందని, కానీ భవిష్యత్ తరాలకు పునాది వేసే వేలాది అంగన్‌వాడీ కేంద్రాలకు కనీస విద్యుత్ సౌకర్యం కూడా కల్పించలేకపోయిందన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>