కలం, నేషనల్ డెస్క్: పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాలు ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీల కూటములు కీలక సమావేశాలకు ప్లాన్ చేశాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి ఈ నెల 17న భేటీ అవుతున్నది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఈ నెల 21న సమావేశమవుతున్నది. పార్లమెంటు సమావేశాల్లో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్, రాజ్యాంగ సవరణ, 30 రోజులు జైల్లో ఉంటే ప్రజా ప్రతినిధులు పదవుల నుంచి దిగిపోవడం.. ఇలాంటి కీలక బిల్లులు చర్చకు రావచ్చని లోక్‌సభ వర్గాల సమాచారం.
ఈ బిల్లులన్నింటికీ ఉభయ సభల్లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరం కావడంతో దానికి తగిన బలాన్ని సమకూర్చుకోవడంపై ఎన్డీఏ ఫోకస్ పెట్టింది. దీనికి సంబంధించి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన మరుసటి రోజున ఎన్డీఏ (NDA) భాగస్వామ్య పక్షాలతో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నది. ఈ సమావేశంలో ప్రభుత్వం అనుసరించనున్న శాసన, పరిపాలనా వ్యూహాలపై భాగస్వామ్య పార్టీలకు బీజేపీ దిశానిర్దేశం చేయనున్నది.
దీనికి ముందే ‘ఇండియా’ కూటమి (INDI Alliance) పార్టీలతో కాంగ్రెస్ అగ్ర నేతలు ఈ నెల 17న సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంటు (Parliament) సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ‘ఇండియా’ కూటమి పార్టీలను చీల్చడం, పలువురు ఎంపీలను ఆకర్షించడం, పార్లమెంటు పక్షాన్ని బీజేపీలో విలీనం చేయడం, కూటమి బలాన్ని తగ్గించే ప్రయత్నాలు.. వీటన్నింటికీ దీటుగా పకడ్బందీ వ్యూహంపై ఈ సమావేశంలో చర్చ జరగనున్నది.
‘ఇండియా’ కూటమి వీక్ కాకుండా తీసుకోవాల్సిన చర్యలపైనే ఈ సమావేశం ఎక్కువగా ఫోకస్ పెట్టనున్నది. శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కూటమి బీజేపీవైపు చూస్తున్నదని వార్తలు వస్తున్న నేపథ్యంలో, డీఎంకే ఇప్పటికే దూరమైనందున సంఖ్యాబలం రీత్యా ప్రభుత్వం ప్రవేశపెట్టే బిల్లులపై లోతుగా చర్చించి తదనుగుణమైన నిర్ణయాలు తీసుకోనున్నది.
Read Also: వరంగల్‌లో అనధికార ఫ్లెక్సీలపై ఉక్కుపాదం.. GWMC ప్రత్యేక డ్రైవ్
Follow Us On: Instagram

