కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో ఎల్-నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా శాస్త్రీయ అధ్యయనం ఆధారంగా రూపొందించిన రాష్ట్రంలోని మొట్టమొదటి కంటింజెన్సీ ప్రణాళికను (Contingency Plan) వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Thummala) గురువారం సచివాలయంలో అధికారికంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ, సహకార శాఖల పరిధిలోని అన్ని విభాగాల అధిపతులతో మంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా జిల్లా కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారుల కోసం ఒక సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. జిల్లాల వారీగా, మండలాల వారీగా వర్షపాత లోటు (Rainfall Deficit) వివరాలను ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా తగిన చర్యలు చేపట్టేందుకు స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించినట్లు ఆయన పేర్కొన్నారు. రానున్న రెండు నెలలకు సంబంధించిన వాతావరణ అంచనాలను శాస్త్రీయంగా విశ్లేషించి, వాటిని ఈ కార్యాచరణ ప్రణాళికలో పొందుపరిచామని మంత్రి తెలిపారు.
రైతులను ఆదుకోవడమే లక్ష్యంగా భారత వాతావరణ శాఖ (IMD) అందించే వాతావరణ సమాచారాన్ని రోజువారీ, వారంవారీ, నెలవారీగా అన్ని సంబంధిత శాఖలతో పంచుకోనున్నట్లు మంత్రి వివరించారు. వాతావరణంలో వచ్చే మార్పులను నిరంతరం పర్యవేక్షిస్తూ, క్షేత్రస్థాయిలో రైతులకు అవసరమైన సూచనలు అందిస్తామన్నారు. మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక, నీటి సంరక్షణ-వినియోగం, వ్యవసాయ నిర్వహణపై రైతులకు శాస్త్రీయ అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. పంట నష్టాలను వీలైనంత వరకు తగ్గించేందుకు వ్యవసాయ, అనుబంధ శాఖలన్నీ పూర్తి సమన్వయంతో పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

