కలం, మహబూబ్ నగర్ బ్యూరో: తనకు చదువు విలువ తెలుసు కాబట్టే విద్యా శాఖను తన దగ్గర పెట్టుకున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. వనపర్తి (Wanaparthy) జిల్లా కొత్తకోట మునిసిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని సీఎం ప్రారంభించారు. కార్పొరేట్ స్థాయి వసతులతో రూ.1.77 కోట్ల సీఎస్ఆర్ నిధులు, దాతల సహకారంతో ఈ పాఠశాల భవనాన్ని నిర్మించారు. పాఠశాల ప్రారంభోత్సవం తర్వాత సీఎం అక్కడ ఏర్పాటు చేసిన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్‌లను పరిశీలించారు. వివిధ ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల నుంచి వచ్చిన వందలాది విద్యార్థులతో సీఎం ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల మెరుగుదల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు.
విద్యార్థులతో మాట్లాడిన అనంతరం సీఎం (CM Revanth Reddy) మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉందని చెప్పారు. నాటి తెలంగాణ ఉద్యమ సమయంలో రాజకీయ నేతల బలిదానాలు లేవని, విద్యార్థులు మాత్రమే తమ ప్రాణాలను బలిదానం చేసి రాష్ట్రాన్ని సాధించారని గుర్తు చేశారు. చదువే మన ఆత్మగౌరవాన్ని నిలబెడుతుందని, అదే మన భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుందని అన్నారు. గత పదేళ్లలో అంగన్‌వాడీల నుంచి యూనివర్సిటీల వరకు ఎక్కడ చూసినా తీవ్ర నిర్లక్ష్యం రాజ్యమేలిందని విమర్శించారు.
తమ ప్రభుత్వం విద్యా వ్యవస్థను సమూలంగా బలోపేతం చేసి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను పేద విద్యార్థులకు అందించడానికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తెలంగాణలో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉండాలని, విద్యార్థులు ఉన్నత స్థాయిల్లో స్థిరపడాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులకు అన్ని అర్హతలు, అనుభవం ఉన్నాయని సీఎం అన్నారు. వీరితో పోలిస్తే ప్రైవేటు వారికి సగం అర్హతలు కూడా ఉండావన్నారు. విద్య కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో విద్యార్థిపై ఏడాదికి రూ.లక్షా 8 వేలు ఖర్చు చేస్తుందని, ఇలా ఏడాదికి రాష్ట్ర వ్యాప్తంగా రూ.30 వేల కోట్లు ఖర్చు చేస్తోందని వివరించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించారు.
Read Also: పాదయాత్రపై కేటీఆర్ సంచలన ప్రకటన!
Follow Us On: X(Twitter)

