కలం, బూర్గంపాడు: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లా బూర్గంపాడు మండలం సోంపల్లి పంచాయతీ పరిధిలోని బుడ్డగూడెం (Buddagudem) గ్రామంలో బుధవారం ఆదివాసీలకు అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల రక్షణ, పోడు భూముల సాగుపై అటవీ అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. పాల్వంచ రేంజ్ ముసలమడుగు సెక్షన్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ అనార్కలి, అటవీ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అధికారులు అటవీ చట్టాలు, అడవుల పరిరక్షణపై గ్రామస్థులకు వివరించారు.
అధికారులు మాట్లాడుతూ, అటవీ హక్కుల చట్టం ప్రకారం చెల్లుబాటు అయ్యే అటవీ హక్కు పత్రాలు లేని భూములలో పోడు సాగు చేయరాదని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా భూములను దున్నడం, పంటలు సాగు చేయడం చట్టవిరుద్ధమని తెలిపారు. అడవులను నరికివేయడం, ప్రభుత్వ ప్లాంటేషన్‌లను ధ్వంసం చేయడం, అక్రమంగా పోడు సాగు చేయడం వంటి చర్యలకు పాల్పడితే అటవీ చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కొత్తగా అడవులను ఆక్రమించవద్దని, అడవులకు నిప్పు పెట్టడం, వన్యప్రాణులను వేటాడడం వంటి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. అటవీ సంపదను భావితరాలకు అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు పేర్కొన్నారు. అడవులలో ఎలాంటి అక్రమ కార్యకలాపాలు కనిపించినా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని గ్రామస్థులను (Buddagudem Villagers) కోరారు. ఈ కార్యక్రమంలో సోంపల్లి మాజీ సర్పంచ్ తాటి వీరాంజనేయులు, సోంపల్లి పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వర్లు, అటవీశాఖ బీట్ అధికారులు, బుడ్డగూడెం గ్రామస్థులు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Read Also: పాదయాత్రపై కేటీఆర్ సంచలన ప్రకటన!
Follow Us On: Instagram

