అభివృద్ధిపై దేశానికే దిశానిర్దేశం చేస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: అభివృద్ధిలో తెలంగాణ దేశానికే దిశా నిర్దేశం చేయ‌బోతుంద‌ని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ (Mahabubnagar) జిల్లా దివిటిప‌ల్లిలోని అమర రాజా గిగా కారిడార్‌లో అమ‌ర రాజా (Amara Raja) సెల్ మ్యానుఫాక్చ‌రింగ్ యూనిట్‌ను సీఎం రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ప్లాంట్‌ను సంద‌ర్శించి సంస్థ కార్య‌క‌లాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. అనంత‌రం అక్క‌డ‌ ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో సీఎం మాట్లాడుతూ.. అమ‌ర‌రాజా గ్లోబ‌ల్ టాలెంట్ ఉన్న లోక‌ల్ కంపెనీ అని ప్ర‌శంసించారు. ఈ సంస్థ‌ చైనాతో పోటీ ప‌డి బ్యాట‌రీలు త‌యారు చేస్తోంద‌ని అభినందించారు.

1983లో అమ‌ర‌రాజా సంస్థ‌ను చిత్తూరు జిల్లాలో ఏర్పాటు చేశార‌ని సీఎం చెప్పారు. కంపెనీలో 700 మంది ఉద్యోగుల్లో 400 మంది మ‌హిళ‌లే ఉన్నార‌ని తెలిపారు. అలాంటి సంస్థ‌ను తెలంగాణలో తీసుకురావ‌డం ఎంతో సంతోష‌మ‌ని చెప్పారు. మ‌రిన్ని ప‌రిశ్ర‌మ‌లు తీసుకొచ్చి పాల‌మూరు జిల్లాను అభివృద్ధి ప‌థంలో న‌డిపిస్తామ‌ని సీఎం హామీ ఇచ్చారు.

తెలంగాణ‌ పారిశ్రామిక అభివృద్ధిలో వైఎస్ఆర్, చంద్ర‌బాబు, కేసీఆర్ పాల‌సీల‌ను కంటిన్యూ చేస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వాటిని కొన‌సాగిస్తూనే మ‌రింత మెరుగైన విధానాల‌ను తీసుకొస్తున్నామ‌ని తెలిపారు. దేశంలో 2.5 శాతం జ‌నాభా ఉన్న తెలంగాణ దేశానికి 5 శాతం జీడీపీని అందిస్తుంద‌ని అన్నారు. 2047 నాటికి దీన్ని 10 శాతానికి పెంచ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని సీఎం స్ప‌ష్టం చేశారు.

ఒకప్పుడు మహబూబ్‌న‌గ‌ర్‌ జిల్లాను దత్తత తీసుకునే స్థాయి నుండి, ప్రస్తుతం మనమే ఇతర జిల్లాలను దత్తత తీసుకునే స్థాయికి వచ్చామని సీఎం అన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో ఇంజినీరింగ్ కళాశాలలు, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలు, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు, యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించేందుకు స్కిల్ యూనివర్సిటీలు, పాలిటెక్నిక్ కళాశాలలను ఏర్పాటుచేసి బలోపేతం చేస్తున్నామని తెలిపారు.

పాలమూరు- రంగారెడ్డికి సంబంధించి 90 టీఎంసీల నీటి కేటాయింపుకై కేంద్ర ప్రభుత్వం తో పాటు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరిపి అవసరమైన నీటి కేటాయింపులు, అనుమతులు సాధించే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని సీఎం చెప్పారు. త్వరలోనే పాలమూరు రైతులకు శుభవార్త అందిస్తామన్నారు. జిల్లాలో కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, రాజోలిబండ (ఆర్‌డీఎస్) వంటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ 2047 పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా అమర‌ రాజా కంపెనీ 32 గిగావాట్ల ప్లాంటును ప్రారంభించుకోవడం ఒక నిదర్శనమన్నారు .2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధించే లక్ష్యంగా ఎనర్జీ లక్ష్యాన్ని చేపట్టడం జరిగిందని, విద్యుత్ పరిశ్రమలే కాకుండా, ఎనర్జీ పరిశ్రమలు తీసుకురానున్నమని, క్లీన్ గ్రీన్ ఎనర్జీ పాలసీ తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు. 2031 నాటికి ఈవీ బ్యాటరీల వినియోగం నాలుగు రెట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరు గ్రీన్ ఎనర్జీ వైపు చూస్తున్నారని తెలిపారు. బ్యాటరీ తయారీలో తెలంగాణ అద్భుతంగా ఉందని, 2023లో 6.8%గా ఉన్న పరిశ్రమల అభివృద్ధి 2026 నాటికి 8.1% చేరుకున్న‌ట్లు వివ‌రించారు. 2034 నాటికి 13% చేరుకునేలా ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పశుసంవర్ధక, డైరీ డెవలప్మెంట్, యువజన క్రీడల సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీధర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, మాజీ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, దేవరకద్ర శాసనసభ్యులు మధుసూదన్ రెడ్డి, షాద్‌నగర్ శాసనసభ్యులు వీర్లపల్లి శంకర్, అచ్చంపేట శాసనసభ్యులు వంశీకృష్ణ, నాగర్ కర్నూల్ శాసనసభ్యులు రాజేశ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా, ఎస్పీ జానకి ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>