కలం, నల్లగొండ: రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మె పిలుపులో భాగంగా నల్లగొండ (Nalgonda) జిల్లా కలెక్టరేట్ ఎదుట ప్రభుత్వ శాఖల్లో అద్దెకు నడుస్తున్న వాహనాల యజమానులు (Rental Vehicle Owners), డ్రైవర్లు బుధవారం భారీ ధర్నా నిర్వహించారు. నెలల తరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేయాలని, అద్దె చార్జీలను సవరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ పరిసరాలను నినాదాలతో హోరెత్తించారు.
ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు, వాహన యజమానులు (Rental Vehicle Owners) మాట్లాడుతూ.. గత 12 నుంచి 22 నెలలుగా ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన అద్దె వాహనాల బిల్లులు పెండింగ్‌లోనే మూలుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రెండేళ్లుగా బిల్లులు రాకపోవడంతో డ్రైవర్లకు జీతాలు ఇచ్చుకోలేక, వాహనాల ఈఎంఐలు కట్టలేక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కన్నీరుమున్నీరయ్యారు. ఫైనాన్స్ కంపెనీల వారు ఒత్తిడి చేస్తుండటంతో కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతుండటంతో పాటు వాహనాల స్పేర్ పార్ట్స్, ఇన్సూరెన్స్, రోజువారీ నిర్వహణ ఖర్చులు భారీగా పెరిగాయని ఆందోళనకారులు తెలిపారు. ప్రస్తుతం ఇస్తున్న రూ. 34 వేలు నెలవారీ అద్దె చార్జీ ఏమాత్రం సరిపోవడం లేదని స్పష్టం చేశారు.
పెరిగిన ధరల నియంత్రణకు అనుగుణంగా నెలవారీ అద్దెను కనీసం రూ. 55వేలకు పెంచాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. “సంవత్సరాల తరబడి జీతాలు, బిల్లులు ఆపితే మేము బతికేదెలా? ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులను ఒకే విడతలో క్లియర్ చేయాలి. అలాగే అద్దె రేట్లను కూడా సవరించాలి. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తాం” అని అద్దె వాహనదారుల సంఘం ప్రతినిధులు చెప్పుకొచ్చారు. తమ న్యాయమైన సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి హామీ ఇవ్వాలని, లేకపోతే సమ్మెను విరమించే ప్రసక్తే లేదని యజమానులు, డ్రైవర్లు స్పష్టం చేశారు.
Read Also: నోయిడాలో అగ్ని ప్రమాదం: ఇద్దరు యువతులు మృతి!
Follow Us On: Instagram

