కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఫ్యూచర్ సిటీలో అమెజాన్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, జూపల్లి, వాకిటి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచంలోనే అత్యంత అధునాతన నగరాన్ని నిర్మించుకున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఫ్యూచర్ సిటీ నగరంలో ఫార్చూన్ 500 లోని కంపెనీలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. గతేడాది 108 దేశాల్లోని ప్రతినిధులను ఆహ్వానించామని వెల్లడించారు. పరిశ్రమలకు సింగిల్ విండోలోనే అన్ని అనుమతులు ఇస్తున్నామని పేర్కొన్నారు.
అదే మా టార్గెట్
భారత జీడీపీకి 10 శాతం అందించడమే తెలంగాణ టార్గెట్ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2047 కల్లా 1 ట్రిలియన్ ఎకానమీకి చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు 2025 డిసెంబర్‌లో కొత్త పాలసీని తీసుకొచ్చామని వివరించారు. . అమెజాన్ డేటా సెంటర్ ఫ్యూచర్ సిటీకి స్టెప్పింగ్ స్టోన్‌గా ఉంటుందన్న సీఎం… రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు ఫ్యూచర్‌సిటీకి వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.
కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్
కాలుష్య రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. దీనికోసం డీజిల్ నుంచి ఈవీలుగా బస్సులను మారుస్తామన్న సీఎం.. 2 లక్షల ఆటోలను డీజిల్ నుంచి ఈవీలుగా మారుస్తామని పేర్కొన్నారు. తెలంగాణలో ఎవరు ఈవీ కొన్నా జీరో ట్యాక్స్ ఉంటుందని స్పష్టం చేశారు. నగరంలో ఉన్న పరిశ్రమలను బయటకు తరలిస్తామని చెప్పారు. క్యూర్ రీజియన్‌ను సర్వీస్ సెక్టార్‌గా మారుస్తామని తెలిపారు. ఔటర్ వెలుపల ఉన్న ప్రాంతాన్ని తయారీ రంగానికి మారుస్తామని వివరించారు.

