వాళ్లది వ్యూహమా.. మౌనమా..?

కలం, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్‌తో కొట్లాడడం కంటే కవితను రాజకీయంగా ఢీకొట్టడం బీఆర్ఎస్‌కు కష్టమవుతున్నదా? అటు పార్టీపైనా ఇటు వ్యక్తిగతం గానూ ఆమె చేస్తున్న విమర్శలు ఇబ్బందికరంగా మారాయా? కవితకు కౌంటర్ ఇవ్వకుండా మౌనం పాటించడం వ్యూహమా?.. లేక నిస్సహాయతా?.. ఇలాంటివన్నీ ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణుల్లో విస్తృతంగా వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ను ఎండగట్టడంలో దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ కవితను పొలిటికల్‌గా తిప్పికొట్టడంలో బీఆర్ఎస్ పెద్దలు ఎందుకు ఉదాసీనంగా ఉన్నారనేది కేడర్‌ను డైలమాలో పడేసింది.

వరుస ఓటములు, పైగా కవిత ఆరోపణలతో ఇప్పటికే పార్టీ నైతికంగా డ్యామేజ్ అయిందని, ఇకపైన ఆమె కామెంట్లకు బ్రేక్ వేయకపోతే మరింత దెబ్బతింటామన్నది గులాబీ కార్యకర్తల ఆవేదన. కింది స్థాయి లీడర్లకు బదులు కేసీఆర్ లేదా కేటీఆర్.. ఈ ఇద్దరు మాత్రమే ఆమెకు గట్టిగా కౌంటర్ ఇవ్వగలుగుతారని, తక్షణం ఆ తరహా నిర్ణయం తీసుకోవడం అవసరమన్నది వారి అభిప్రాయం. పార్టీని కాపాడుకోవాలన్నా, తిరిగి అధికారంలోకి రావాలన్నా కవిత ఆరోపణలకు కేసీఆర్ లేదా కేటీఆర్ స్పందించక తప్పదని కేడర్ భావిస్తున్నది. లేకపోతే అసలుకే ఎసరు వస్తుందని ఆందోళన చెందుతున్నది.

ముందు నుయ్యి.. వెనుక గొయ్యి..

కవిత విషయంలో బీఆర్ఎస్ పరిస్థితి (BRS vs Kavitha) ‘ముందు నుయ్యి వెనుక గొయ్యి’ చందంగా తయారైంది. ఆమె కామెంట్లకు కౌంటర్ ఇస్తే ఆమెకు పొలిటికల్‌గా మరింత మైలేజ్ ఇచ్చినట్లవుతుంది.. ఒక్కసారి రియాక్ట్ అయితే అది డెయిలీ సీరియల్‌లాగా మారుతుంది.. సైలెంట్‌గా ఉంటే ఆమెను లెక్కచేయట్లేదనే మెసేజ్ వెళ్తుంది.. ఇలాంటి అభిప్రాయంతోనే ఇప్పటివరకూ బీఆర్‌ఎస్ వైపు నుంచి రియాక్షన్ రాలేదన్న అభిప్రాయం గులాబీ లీడర్లలో ఉంది. కానీ, ఆమె వైపు నుంచి కామెంట్లు ఆగకుండా వస్తూనే ఉండడంతో పార్టీ నైతికంగా డ్యామేజ్ అవుతున్నదన భావన నెలకొంది.

వ్యక్తిగతంగా కేటీఆర్‌పై, హరీశ్‌రావుపై నిప్పులు చెరిగిన కవిత.. తొలుత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలోని తప్పులపై సారీ చెప్పారు. తద్వారా అప్పటి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను ప్రజల ముందు దోషిగా చూపెట్టారన్న అభిప్రాయం గులాబీ శ్రేణుల్లో నెలకొంది. తర్వాత.. బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన నిధులన్నీ అవినీతి సొమ్మేనని, ఆంధ్రా కాంట్రాక్టర్ల నుంచి వచ్చిందేనని ఆమె ఆరోపించడం.. కొందరి పేర్లు కూడా ప్రస్తావించడంతో పార్టీ ప్రతిష్ట ప్రశ్నార్థకంగా మారుతున్నది కొందరు రాష్ట్ర, జిల్లా స్థాయి లీడర్లు అంటున్నారు.

ఆ ఇద్దరిపైనే కేడర్ ఆశలన్నీ..!

కవిత చేస్తున్న కామెంట్లకు కౌంటర్ ఇవ్వడానికి బీఆర్ఎస్ లీడర్లకు ధైర్యం చాలడంలేదు. పార్టీ అధినేత కేసీఆర్ కుమార్తె కావడంతో హెల్ప్ లెస్ గా ఉండిపోతున్నారు. గతంలో కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రియాక్ట్ అయిన తర్వాత ఎదురైన అనుభవాన్ని గుర్తుచేసుకుంటున్నారు. దీంతో ఆమెను పొలిటికల్‌గా ఢీకొట్టాలన్నా, బీఆర్ఎస్‌ను కాపాడుకోవాలన్నా పార్టీ చీఫ్ గా కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ దే బాధ్యత అనే మాటలు లీడర్ల నుంచి వినిపిస్తున్నాయి.

ధాన్యం కొనుగోళ్లు, రైతు భరోసా, అప్పులు, కాళేశ్వరం వంటి అంశాలల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టగలిగామని.. కానీ కవిత విషయంలో మాత్రం నిస్సహాయులుగా ఉండిపోవాల్సి వస్తున్నదనేది కొందరు గులాబీ లీడర్ల వాదన. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ స్పష్టమైన నిర్ణయం తీసుకుని ఆయన గానీ లేక కేటీఆర్‌గానీ ఇకపైన కవిత కామెంట్లకు గట్టిగా బదులిస్తేనే పార్టీని జనం నమ్మే పరిస్థితి ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని కేటీఆర్‌ దృష్టికి ఒకరిద్దరు సీనియర్ లీడర్లు తీసుకెళ్లినట్లు తెలంగాణ భవన్ వర్గాల సమాచారం.

ఎజెండాను సెట్ చేసిన కవిత

పదేండ్ల పాటు పవర్‌లో ఉన్న బీఆర్ఎస్.. కవిత విషయంలో మాత్రం సైలెంట్‌గా ఉండడం గులాబీ పార్టీ కేడర్‌కు తీవ్ర అసంతృప్తినే మిగులుస్తున్నది. సాధారణంగా కేసీఆర్ తన ప్రత్యర్థిని ఉచ్చులోకి లాగేలా రాజకీయ ఎజెండాను సెట్ చేస్తారని, కానీ కవిత విషయంలో మాత్రం ఆమె సెట్ చేసిన ఎజెండాలోనే చిక్కుకునేలా తయారైందనే అభిప్రాయాలు బీఆర్ఎస్ నేతల నుంచి వినిపిస్తున్నాయి.

బీఆర్ఎస్ అంతర్గత వ్యవహారాలపై లోతైన అవగాహన ఉన్న కవిత.. ఆ పార్టీ దగ్గర ఉన్న రూ.1,400 కోట్ల గురించి ప్రస్తావించడంలో రానున్న రోజుల్లో మరిన్ని అంశాలను తెరపైకి తెస్తారనే ఆందోళనలో గులాబీ శ్రేణుల్లో నెలకొంది. కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ మౌనంగా ఉండడం వ్యూహంగా కనిపించడంలేదని, కవిత రాజకీయ ప్రాధాన్యాన్ని తగ్గించేలా లేదని, సమాధానం చెప్పకపోవడంతో ఆ ఆరోపణలు వాస్తవమే అనే మెసేజ్ ప్రజల్లోకి బలంగా వెళ్తున్నదని తెలంగాణ భవన్‌ వర్గాల్లో చర్చ జరుగుతున్నది.

తండ్రీకొడుకు రియాక్షన్ ఏమిటో?

“రాజకీయాల్లో ప్రత్యర్థి ఎవరైనా అఫెన్సివ్‌గానే ఉండాలన్నది జనరల్ పర్‌సెప్షన్.. కూతురైనా, కొడుకైనా, బంధువైనా, సన్నిహితులైనా.. ఇదే సూత్రం రాజకీయ ప్రత్యర్థిగా కవితకూ వర్తిస్తుంది.. కానీ ఈ ఫార్ములాను బీఆర్ఎస్ పాటించకపోవడం కవితకు అడ్వాంటేజ్‌గా మారింది.. కవితను పొలిటికల్‌గా నిలువరించడం ఇప్పుడు తండ్రిగా కేసీఆర్, అన్నగా కేటీఆర్‌ బాధ్యత. ఎలాగూ హరీశ్‌రావుపై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నందున ఆయన స్పందించే అవకాశాలు తక్కువ.

తండ్రీ కొడుకులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కీలకం. పార్టీని కాపాడుకోవడం, శ్రేణుల డిమాండ్‌కు తగినట్లుగా పవర్‌లోకి రావాలంటే కవితనూ రాజకీయ ప్రత్యర్థిగానే పరిగణించాలి..” అని బీఆర్ఎస్ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఓట్లు, సీట్ల సంగతి ఎలా ఉన్నా కల్వకుంట్ల కుటుంబంలోని ఒక వ్యక్తిగా కవిత ప్రస్తావించిన ఆరోపణలు కేవలం అంశాలకు సంబంధించినవే కాక సరికొత్త నెరేటివ్ క్రియేట్ చేసి జనంలోకి వదలినట్లయింది. దీనిపై ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారనేది కీలకం కానున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>