కలం, గద్వాల : వేగంగా వెళ్తున్న కారు పంచర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. అయిజ మండలం మేడికొండ గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకున్న ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ముగ్గురికి గాయలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన వివరాలు.. గద్వాల (Gadwal) కు చెందిన రంగస్వామి(33), శివ(31), మహేందర్, నాగేంద్ర బాబు, తేజ మంగళవారం మంత్రాలయంలోని శ్రీరాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకుని గద్వాలకు కారులో బయలుదేరారు.
మార్గం మధ్యలో అయిజ మండలం మేడికొండ గ్రామ శివారులో వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి బోల్తాపడింది. కారు నడుపుతున్న రంగస్వామితో పాటు శివ మృతి చెందారు మహేందర్, నాగేంద్ర బాబు, తేజ లు గాయపడారు. నాగేంద్ర బాబుకు తీవ్రగాయాలవడంతో చికిత్స కోసం కర్నూల్ ఆసుపత్రికి తరలించారు.
గాయపడిన మిగతా వారిని వైద్యం కోసం గద్వాల జిల్లా ఆసుపత్రికి తరలించారు. రంగస్వామి, శివల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ఆసుపత్రికి తరలించారు. అయిజ పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన రంగస్వామికి భార్యతో పాటు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శివకు భార్యతో పాటు పిల్లలు ఉన్నారు.

