కలం, యాదగిరిగుట్ట: హరీశ్ రావు ఏపీ సంస్థలను విమర్శిస్తూనే.. మరోవైపు అదే సంస్థలతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్నారని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య (Beerla Ilaiah) ఆరోపించారు. శ్రీ చైతన్య, నారాయణ విద్యాసంస్థలకు హరీశ్ రావుకు చెందిన మిల్చీ డైరీ సంస్థనే పాలు సరఫరా చేస్తోందన్నారు. ఆయన సతీమణి తన్నీరు శ్రీనిత పేరుతోనే సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
హరీశ్ రావుకు 24 గంటల గడువు ఇస్తున్నామని, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా మిల్చీ సంస్థతో తనకు సంబంధం ఉందో లేదో బహిరంగంగా ప్రకటించాలని సవాల్ విసిరారు.
తన సంస్థ ప్రయోజనాల కోసం..
ఆంధ్రప్రదేశ్ సంస్థలతో దొంగచాటుగా వ్యాపారం చేస్తూ, ప్రజల ముందు మాత్రం ఆంధ్ర సంస్థలను విమర్శించడం హరీశ్ రావుకు అలవాటైందని విప్ బీర్ల అయిలయ్య ఆరోపించారు. తన మిల్చీ సంస్థ ప్రయోజనాల కోసం విజయ డెయిరీ, మదర్ డెయిరీ వంటి సంస్థలను నష్టాలపాలు చేశారని విమర్శించారు.
హరీశ్ యాదగిరిగుట్టకు వచ్చినా.. అసెంబ్లీకి వచ్చినా తనకు అభ్యంతరం లేదని, ఎక్కడైనా బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు. దమ్ముంటే తన సవాల్ స్వీకరించాలన్నారు.
కాళేశ్వరంలో అవినీతితోనే..
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ద్వారా సంపాదించిన డబ్బుతోనే మిల్చీ డెయిరీ ఏర్పాటు చేశారని విప్ బీర్ల అయిలయ్య ఆరోపించారు. కేటీఆర్, హరీశ్ రావు తెలంగాణ రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, వారికి మతి భ్రమించిందని విమర్శించారు. కేటీఆర్ పాదయాత్ర ప్రకటించగానే హరీశ్ రావుకు పాదయాత్ర గుర్తుకు వచ్చిందన్నారు.
కేటీఆర్‌ను రాజకీయంగా అడ్డుకునేందుకే పాదయాత్ర చేపడుతున్నారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలు బయటపడతాయనే భయంతో బీజేపీతో బీఆర్ఎస్ నేతలు చీకటి ఒప్పందం చేసుకున్నారని బీర్ల అయిలయ్య ఆరోపించారు.

