జిల్లాలో హాట్ టాపిక్‌గా రైస్ మిల్లర్ల సీఎంఆర్ బకాయిలు

కలం, కరీంనగర్ బ్యూరో: రైస్ మిల్లర్ల కస్టమ్ మిల్లింగ్ రైస్ ( Karimnagar CMR Dues) బకాయిల వ్యవహారం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని మర ఆడించి తిరిగి బియ్యం అప్పగించడంలో మిల్లర్లు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. వందల కోట్ల రూపాయల ప్రభుత్వ ధనం మిల్లర్ల వద్దే పేరుకుపోతుంటే.. రికవరీ చేయడంలో, దోషులపై చర్యలు తీసుకోవడంలో సివిల్ సప్లై అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) బకాయిల దందా కోట్లకు పడగలెత్తింది. ప్రభుత్వం మర ఆడించడానికి ఇచ్చిన ధాన్యం బకాయిలు తిరిగి రాకపోవడంతో ప్రభుత్వ ఖజానాకు భారీ గండి పడుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రూ. 215 మిల్లుల నుంచి రూ.750 కోట్ల విలువైన సీఎంఆర్ బకాయిలు పేరుకుపోవడం పౌరసరఫరాల శాఖ, సంస్థ అధికారుల పట్ల అనుమానాలకు తావిస్తోంది.

గడువులు ముగుస్తున్నా లక్ష్యం మేరకు సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లిం గ్‌ రైస్‌) ఇవ్వని మిల్లులపై ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్నా మొండి బకాయిదారుల్లో చలనం రావ డం లేదు. ఆయా సీజన్లలో పౌర సరఫరాల శాఖ అధ్వ ర్యంలో ధాన్యం స్వీకరించిన మిల్లులు సకాలంలో బి య్యం అందించాలని ఆదేశాలు జారీ చేస్తున్నా పట్టిం చుకోకపోవడంతో రెవెన్యూ రికవరీ (ఆర్‌ఆర్‌) యాక్టు, క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తున్నారు. ఒక్క కరీంనగర్ జిల్లాలోనే 71 మిల్లుల నుండి దాదాపు 278.59 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి.

ఇక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూస్తే… పెద్దపల్లిలో రూ. 218.15 కోట్లు, జగిత్యాలలో రూ. 140 కోట్లు, సిరిసిల్లలో రూ. 69.39 కోట్ల మేర బకాయిలు కొండలా పేరుకుపోయాయి. కేవలం కరీంనగర్ జిల్లాలోనే 75 మిల్లుల నుంచి సుమారు 1,15,328 టన్నుల ధాన్యం మర ఆడించి, 77,562 టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాల్సి ఉంది. దీని విలువ అక్షరాలా రూ. 278 కోట్ల పైమాటే! గడువు ముగిసినా కేవలం నలుగురు మిల్లర్లు మాత్రమే స్పందించారు. మిగతా 71 మంది బకాయిదారులు పైసా చెల్లించకుండా మొండికేస్తున్నారు.

మిల్లర్లతో అధికారుల మిలాఖత్..

నిబంధనల ప్రకారం. నిషేధిత జాబితాలో (డిఫాల్టర్లు) ఉన్న మిల్లులకు తదుపరి సీజన్‌లో ధాన్యం కేటాయించకూడదు. కానీ అధికారుల లోపాయికారీ ఒప్పందాలు, మిల్లర్ల బ్లాక్ మెయిలింగ్ తంత్రాల వల్ల నిబంధనలు తుంగలో తొక్కారు. దీనికి తోడు ఉమ్మడి జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రుల అండదండలు లేకపోలేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజా 2026 యాసంగి సీజన్‌లో ఉమ్మడి జిల్లాలోని దాదాపు 150 నిషేధిత మిల్లులకు తిరిగి ధాన్యం కేటాయించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 215 రైస్ మిల్లుల నుంచి రూ.750 కోట్ల పైగా సీఎంఆర్ బకాయిలున్నట్లు తెలుస్తోంది. ఇంత భారీ మొత్తంలో వందల కోట్లు బకాయిలు ఉన్నా అధికారులు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో రూ. 100 కోట్లకు పైగా బకాయిలు ఉన్న బడా మిల్లర్లు 10 మంది వరకు ఉంటే… వారిలో ఒక్కరిపైనా ఇప్పటివరకు కఠిన చర్యలు తీసుకోలేదు.

కానీ, రూ. 10 కోట్లు అంతకంటే తక్కువ బకాయి ఉన్న చిన్న మిల్లర్లపై మాత్రం పెద్దపల్లిలో 8 మందిపై, కరీంనగర్‌లో ముగ్గురిపై కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. అయితే ఇటీవల పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లోని మారుతి అనే రైస్ మిల్లర్ రూ.7 కోట్ల బకాయిలున్నాడని పలుమార్లు కేసు నమోదు చేయగా చర్లపల్లి జైలుకు తరలించారు. అతనిపై పిడియాక్టు నమోదు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఇదే మొదటి సారి కావడం సంచలనం రేపింది.

మరో వైపు 25 శాతం జరిమానా, వడ్డీ మాఫీ చేస్తేనే బకాయిలు వసూలవుతాయని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. ఈ భారీ కుంభకోణం వెనుక అధికారుల అండదండలు ఉన్నాయా? కోట్ల రూపాయల ప్రభుత్వ ధనాన్ని రికవరీ చేయడంలో ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోబోతోంది? అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది.

అధికారుల బదిలీలు ఉత్తమాటే..

కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పౌసరఫరాల సంస్థ( సివిల్ సప్లైస్ కార్పోరేషన్) జిల్లా అధికారులు ఏళ్లుగా ఇక్కడే తిష్ట వేశారు. ఉమ్మడి కరీంనగర్ ధాన్యాగార జిల్లా కావడం.. రైస్ మిల్ ఇండస్ట్రీ సైతం పెరగడంతో తాము కూర్చున్న కుర్చీని వదలడం లేదన్న ఆరోపణలున్నాయి. మంత్రుల అండదండలు అటు రైస్ మిల్లర్లకు.. ఇటు అధికారులకు దండిగా ఉండడంతోనే పౌరసరఫరాల శాఖ , కార్పోరేషన్ మసకబారుతోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది జూన్ లో కరీంనగర్ ఉమ్మడి జిల్లా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఇంచార్జి మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన ఒకటి, రెండు సార్లు జిల్లా కేంద్రానికి వచ్చారు.

అన్ని శాఖలపై పూర్తి స్థాయిలో సమీక్షించకుండానే తూతూమంత్రంగా వచ్చి వెళ్లిపోయారని చర్చించుకుంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ లోని నలుగురు జిల్లా అధికారులు బదిలీలు జరిగినా తిరిగి ఈ 4 పొరుగు జిల్లాల్లోకే మారుతున్నారు. ఓ అధికారిని రాష్ట్రస్థాయిలోకి బదిలీ చేస్తే పది రోజులు అక్కడ.. పది రోజులు ఇక్కడ అనే విధంగా పనిచేసి మంత్రుల పైరవీతో తిరిగి ఇదే జిల్లాలో కొనసాగుతున్నాడంటే అర్దం చేసుకోవచ్చు.. ఇక్కడి ఆదాయం దండిగా ఉంది కాబట్టే ఏ అధికారి వదులుకోకుండా ఉన్నారు.

దొరికితేనే దొంగ..

రైస్‌ మిల్లులకు అప్పగించిన ధా న్యం పక్కదారి పడుతుందనే ఆరోపణలు ఉన్నాయి. ధా న్యాన్ని బియ్యంగా మార్చి బహిరంగ మార్కెట్లో విక్ర యిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. గత హయాంలో సీఎం ఆర్‌ ఇచ్చే సమయంలో రేషన్‌ బియ్యాన్నే కొనుగోలు చే సి తిరిగి అప్పగిస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నా యి. ప్రస్తుతం సన్న బియ్యం ఇవ్వడంతో వాటిని సైతం సేకరిస్తూ సీఎంఆర్ లో సర్దుకుంటున్నారు. ఇటీవల రాజన్న సిరిసిల్ల పెద్దూరు ఎంఎల్ఎస్ పాయింట్ లో భారీ ఎత్తున బియ్యాన్ని మిల్లులకు తరలిస్తుండగా కుంభకోణం వెలుగుచూసింది.

ఇదే క్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ మిల్లులకు సీఎంఆర్ చూపించుకునేందుకు మిల్లర్లు పెద్ద ప్లానే వేస్తున్నారు. అందుకు అధికారులు సైతం అండగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. దొరికితేనే దొంగ లేకుంటే దొర అన్నట్లు ఈ వ్యవహారం సాగుతోంది. అలాగే ఒక్కొక్కరికి రెండేసి చొప్పున మిల్లులు ఉండగా గత కొన్నేళ్లు ప్రభుత్వం ఇచ్చే ధాన్యంతో కోట్లకు పడగలెత్తు తున్నారు . భవిష్యత్తులో ఇలాంటి మోసాలు జరగకుండా ఉండేందుకు, ధాన్యం కేటాయింపు సమయంలోనే మిల్లర్లు 25 శాతం బ్యాంక్ గ్యారెంటీ సమర్పించాలనే కఠిన నిబంధనను ప్రభుత్వం అమలులోకి తెచ్చింది.

దారి మళ్లించిన ధాన్యం విలువకు 25 శాతం పెనాల్టీ, 12 శాతం వడ్డీ కలిపి వసూలు చేయడానికి పౌరసరఫరాల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అయినప్పటికీ చాలా మంది మిల్లర్లు మొండి కేస్తుండ టంతో వారి కుటుంబ సభ్యుల పేరిట ఉన్న స్థిరాస్థుల ను సైతం జప్తు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గడువు ముగిసినా కేవలం కొద్దిమంది మిల్లర్లు మాత్రమే స్పందించారు. మిగతా బకాయిదారుల మిల్లుల్లో ధాన్యం ఎంత ఉందో లెక్క తేల్చేందుకు రెవెన్యూ అధికారులతో కలిసి సివిల్ సప్లై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ‘పంచనామా’ నిర్వహించి పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

ఎక్కడ? ఎంత బకాయి?

కరీంనగర్ జిల్లా: రూ. 278.59 కోట్లు (71 మిల్లులు)
పెద్దపల్లి జిల్లా: రూ. 218.15 కోట్లు (48 మిల్లులు)
జగిత్యాల జిల్లా: రూ. 140.00 కోట్లు (36 మిల్లులు)
సిరిసిల్ల జిల్లా: రూ. 69.39 కోట్లు (60 మిల్లులు)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>