కలం, భువనగిరి: పోచంపల్లి అభివృద్ధి తన లక్ష్యమని, రూ.7.90 కోట్ల నిధులు కేటాయించినట్లు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (Kumbam Anil Kumar Reddy) తెలిపారు. పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో వివిధ అభివృద్ధి పనుల పురోగతిపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. హెచ్ఎండీఏ ద్వారా భువనగిరి నియోజకవర్గానికి రూ.56 కోట్ల నిధులు తీసుకొచ్చామని తెలిపారు.
నేతన్నల నిలయమైన పోచంపల్లిలో మినీ ట్యాంక్‌బండ్ నిర్మాణంతో పాటు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, కమ్యూనిటీ హాల్స్, శ్మశానవాటికల అభివృద్ధి, విద్యుత్ మౌలిక సదుపాయాల కల్పన చేపట్టినట్లు వివరించారు. అమృత్ పథకం కింద రిజర్వాయర్ నిర్మాణం వంటి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
పెద్ద చెరువు పనుల పరిశీలన..
పోచంపల్లి మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులను నాణ్యతతో, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అనంతరం పోచంపల్లి పెద్ద చెరువును పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని, నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సూచించారు.
ఈ సమీక్షలో మున్సిపల్ ఛైర్మన్ తడక వెంకటేష్, వైస్ ఛైర్మన్ కొయ్యడ రజినీ శ్రీనివాస్, మున్సిపల్ కమిషనర్ అంజన్ రెడ్డి, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ప్రజాప్రతినిధులు, హెచ్ఎండీఏ, పబ్లిక్ హెల్త్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్, పంచాయతీ రాజ్ శాఖల అధికారులు పాల్గొన్నారు.

