క్వారీల్లో నోటీసులు.. వాహనాల్లో తనిఖీలు

కలం, కరీంనగర్ బ్యూరో: సామర్థ్యానికి మించి రహదారులపై రయ్యిమంటూ దూసుకెళ్తున్న ఓవర్‌లోడ్ వాహనాలపై రవాణా శాఖ ఉక్కుపాదం మోపుతోంది. ఉమ్మడి కరీంనగర్ (Karimnagar) జిల్లాలో నిబంధనలు ఉల్లంఘించే పరిమితికి మించి భారంగా నడుస్తున్న ఓవర్‌లోడ్ వాహనదారులు, క్వారీ యాజమాన్యాలపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక బృందాలతో కొరఢా ఝళిపిస్తున్నారు.

పరిమితికి మించి గ్రానైట్, ఇసుక, మట్టి తరలించే వాహనాల వల్ల రహదారులు ధ్వంసం కావడమే కాకుండా, ఘోర ప్రమాదాలు జరుగుతుండటంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ మేరకు రవాణా, గనుల శాఖ సంయుక్తంగా కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది.

కరీంనగర్ జిల్లాపై ఫుల్ ఫోకస్..

కరీంనగర్ జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన గ్రానైట్ పరిశ్రమను లక్ష్యంగా చేసుకుని రవాణా, గనుల శాఖల అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో మొత్తం 265 గ్రానైట్ క్వారీలు ఉండగా, అందులో ప్రస్తుతం పనిచేస్తున్న 204 క్వారీ నిర్వాహకులకు ముందస్తుగా నోటీసులు జారీ చేశారు. వాహనాలు రోడ్డుపైకి వచ్చిన తర్వాత పట్టుకోవడం కంటే, అవి లోడింగ్ అయ్యే క్వారీల్లోనే అరికట్టాలని సంయుక్తంగా వ్యూహాన్ని రచించారు.

ఆర్సీలో అనుమతించిన గ్రాస్ వెహికల్ వెయిట్ కంటే ఒక్క కిలో కూడా ఎక్కువ లోడ్ చేయకూడదని, లోడింగ్ పాయింట్ ఇన్‌ఛార్జ్‌లే పూర్తి బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

నాలుగు జిల్లాల అధికారులతో ప్రత్యేక బృందం..

ఓవర్‌లోడింగ్ అక్రమాలను నిరంతరం పర్యవేక్షించేందుకు కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాలకు చెందిన నలుగురు మోటార్ వాహన ఇన్‌స్పెక్టర్లతో ప్రత్యేక ‘స్పెషల్ స్క్వాడ్’ బృందాన్ని రవాణా శాఖ రంగంలోకి దించింది.

వీళ్లు రాత్రింబవళ్లు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓవర్‌లోడ్ రవాణాపై కమిషనర్ ఆదేశాల మేరకు గత నెల 26వ తేదీ నుంచి స్పెషల్ డ్రైవ్ ముమ్మరంగా సాగుతోంది.

పది రోజుల్లోనే 22 కేసులు..

గడిచిన 10 రోజుల్లోనే నిబంధనలు ఉల్లంఘించిన వాహనాలపై 22 ఓవర్‌ లోడ్ కేసులు నమోదు చేసి, రికార్డు స్థాయిలో రూ.4,50,000 పెనాల్టీ రూపంలో వసూలు చేశారు. మోటారు వాహనాల చట్టం-1988 లోని సెక్షన్ 113, సెక్షన్ 194 ప్రకారం ఈ కేసులు నమోదు చేశారు. నిబంధనలు ఉల్లంఘించిన 9 మంది డ్రైవర్ల లైసెన్సులను ఇప్పటికే సస్పెండ్ చేశారు.

ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 210 కేసులు నమోదు కాగా భారీగా డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేశారు. జిల్లాల వారీగా చూస్తే కరీంనగర్ జిల్లాలో 51 కేసులు, పెద్దపల్లిలో 105 కేసులు, జగిత్యాలలో 31 కేసులు, రాజన్న సిరిసిల్లలో 23 కేసులు నమోదయ్యాయి.

డిజిటల్ నిఘాతో తనిఖీలు..

వాహనాల తనిఖీ కోసం ప్రత్యేకంగా వే బ్రిడ్జి ఆధారిత ధ్రువీకరణ వ్యవస్థను ప్రవేశపెట్టారు. వాహన బరువు తనిఖీ చేసిన తర్వాత ఆ సమాచారాన్ని ఎస్ఎంఎస్, వాట్సాప్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తారు. ఒకవేళ ఏ వాహనమైనా తనిఖీకి రాకపోతే దానిని ఓవర్‌లోడ్‌గా పరిగణించి క్వారీలపై చర్యలు తీసుకుంటారు.

భారీ జరిమానాలు.. నేరుగా కోర్టుకే

గతంలో మాదిరి కేవలం జరిమానా కట్టి తప్పించుకోవడం ఇకపై కుదరదు. నిబంధనలు అతిక్రమిస్తే నేరుగా కోర్టుకే (ప్రాసిక్యూషన్) వెళ్లాల్సి ఉంటుంది. అధిక బరువుకు రూ.20వేలతో పాటు అదనంగా ఉన్న ప్రతి టన్నుకు రూ.1,000 చొప్పున జరిమానా విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే డ్రైవర్‌కు రూ. 5,500 జరిమానా విధిస్తూ కోర్టుకు పంపుతున్నారు.

అబద్దం చెబితే అంతే సంగతులు..

లైసెన్స్ ఉన్నా లేదని అబద్ధం చెప్పి తప్పించుకునే వారి కోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇటీవల ఓవర్ లోడ్‌తో వెళ్తున్న వాహనం పట్టుబడితే డ్రైవర్‌కు లైసెన్స్ లేకపోవడంతో కోర్టుకు పంపారు. దీంతో సామర్థ్యానికి మించిన బరువుకు రూ.32 వేలు, లైసెన్స్ లేనందుకు రూ.32 వేలు విధించినట్లు సమాచారం. మరో నాలుగు వాహనాలను సైతం కోర్టుకు పంపించారు.

ఎక్కువ సార్లు దొరికితే.. పర్మిట్ రద్దు..

ఓవర్‌ లోడ్ వాహనం నడుపుతూ మొదటిసారి దొరికితే డ్రైవింగ్ లైసెన్స్‌ను 3 నెలల పాటు సస్పెండ్ చేస్తారు. రెండోసారి దొరికితే లైసెన్స్‌ను శాశ్వతంగా రద్దు చేస్తారు. ఒకే వాహనం ఏడాదిలో రెండు కంటే ఎక్కువ సార్లు ఓవర్‌లోడ్‌తో పట్టుబడితే ఆ వాహనం పర్మిట్లను రద్దు చేయనున్నారు.

రోడ్ల రక్షణ, ప్రజల భద్రత మరియు ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా ఉండేందుకే రవాణా శాఖ ఈ కఠినమైన నిర్ణయాలు తీసుకుంది. వాహనదారులు, క్వారీ నిర్వాహకులు నిబంధనల ప్రకారం నిర్ణీత బరువును మాత్రమే రవాణా చేయాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>