కలం, స్పోర్ట్స్: బదిర మహిళల క్రికెట్‌లో టీమిండియా (Indian Deaf Women Cricket) సరికొత్త చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. ఈ క్లీన్ స్వీప్‌తో భారత బదిర మహిళలు తమ తొలి అంతర్జాతీయ టూర్‌లో సరికొత్త చరిత్రను లిఖించారు. శ్రీలంకలోని మొరటువలో ఉన్న డి సోయ్సా అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్‌లు జరిగాయి. జూలై 13న జరిగిన ఆఖరిదైన ఐదో మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంకను భారత్ కేవలం 40 పరుగులకే ఆలౌట్ చేసింది.
అనంతరం కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. మ్యాచ్ ముగిసిన తర్వాత స్టేడియంలో ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీలంక క్రీడా శాఖ మంత్రి సునీల్ కుమార గమగే, భారత డిప్యూటీ హైకమిషనర్ మైత్రేయ్ కుల్కర్ణి, శ్రీలంక ఎంపీ సుగత్ వసంత ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. మైత్రేయ్ కుల్కర్ణి విజేతలకు ట్రోఫీలను అందించారు. ఈ సిరీస్‌లో భారత ఆటగాళ్లు ప్రత్యేక అవార్డులను గెలుచుకున్నారు.
శ్రద్ధా వైష్ణవ్ ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్ మ్యాచ్‌గా నిలవగా, చాందిని ఖాన్ బెస్ట్ బౌలర్ ఆఫ్ ది సిరీస్‌గా, నీదా జాబి షేక్ బెస్ట్ బ్యాటర్ ఆఫ్ ది సిరీస్‌గా, రెడ్డి జ్యోష్ణ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా అవార్డులను అందుకున్నారు. ఇండియన్ డెఫ్ క్రికెట్ అసోసియేషన్ (IDCA) అధ్యక్షుడు సుమిత్ జైన్ ఈ విజయంపై స్పందిస్తూ, భారత పురుషుల జట్టు తరహాలోనే మహిళల జట్టు కూడా అంతర్జాతీయ స్థాయిలో రాణించడానికి సిద్ధంగా ఉందని నిరూపించిందని అన్నారు.
ఈ సిరీస్ నిర్వహణకు సహకరించిన శ్రీలంక క్రికెట్ అసోసియేషన్, క్రీడా మంత్రిత్వ శాఖ, స్పాన్సర్లు, గ్రౌండ్ స్టాఫ్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇరు జట్ల ఆటగాళ్లకు అభినందనలు తెలియజేశారు. అలాగే ఐడీసీఏ సీఈఓ రోమా బల్వానీ మాట్లాడుతూ, తొలి టూర్‌లోనే ఈ స్థాయి ప్రదర్శన చేయడం అసాధారణమైన విషయమన్నారు.

