త్వరలో పార్లమెంట్ సమావేశాలు.. ఎంపీలకు సీఎం ముఖ్య సూచనలు

కలం, వెబ్ డెస్క్: మరో వారం రోజులో పార్లమెంట్ సమావేశాలు (Parliament Session) జరుగనున్న నేపథ్యంలో అన్ని పార్టీల పార్లమెంట్ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ముఖ్య సూచనలు చేశారు.తెలంగాణ విశాల ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా ప‌ని చేయాల‌ని ఎంపీలకు సూచించారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో రాజ‌కీయాల‌కు అతీతంగా క‌లిసి ముందుకు సాగుదామ‌ని పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టులు, మౌలిక వ‌స‌తుల అభివృద్ధికి సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వం నుంచి అవ‌స‌ర‌మైన అనుమ‌తుల సాధ‌న‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌న్నారు.

ఈ నెల 20 నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాల‌పై ప్రజాభవన్‌లో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ ద్వారా సీఎం వివరించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పొంగులేటి, జితేంధర్ రెడ్డి,, రాష్ట్ర ఎంపీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

దేశ జ‌నాభాలో 10 శాతం జ‌నాభా 6 మ‌హా నగ‌రాల్లో ఉంద‌ని, ఈ న‌గరాలు 25 శాతం జీడీపీ క‌లిగి ఉన్నాయ‌ని సీఎం రేవంత్ వివరించారు. హైద‌రాబాద్‌లో ఐఐఎం (IIM) ఏర్పాటు కోసం కేంద్ర ఆర్థిక శాఖ అనుమ‌తి అవ‌స‌ర‌మని, ఎంపీలు ఈ విష‌యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ని క‌లిసి ఐఐఎం మంజూరుకు విజ్ఞ‌ప్తి చేయాల‌ని సూచించారు.

హైదరాబాద్ మెట్రో ఫేజ్‌-I స్వాధీనం, మెట్రో ఫేజ్‌-2 విస్త‌ర‌ణ‌కు సంబంధించి కేంద్ర ప్ర‌భుత్వంతో చర్చించాలని అన్నారు. హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్ (RRR) ఉత్త‌ర భాగంలో 95 శాతం భూ సేక‌ర‌ణ పూర్త‌యింద‌ని.. ఆ ప‌నుల ప్రారంభానికి, ద‌క్షిణ భాగం ఆర్ఆర్ఆర్ భూ సేక‌ర‌ణ‌కు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెల‌పాల్సి ఉంద‌ని అన్నారు. దీనిపై కూడా ఎంపీలు ప్ర‌త్యేక శ్ర‌ద్ధ చూపించాలన్నారు.

మూసీ పున‌రుజ్జీవ‌నం మొద‌టి ద‌శ టెండ‌ర్ల ద‌శ‌కు వ‌చ్చింద‌ని.. ఈ ప‌నుల‌ను అర్బ‌న్ ఛాలెంజ్ ఫండ్ కింద తీసుకునే విష‌యంలో కేంద్ర అప్రూవ‌ల్ లెట‌ర్ ఇవ్వాల్సి ఉందని.. దీనిపై కేంద్ర మంత్రికి విజ్ఞప్తి చేయాలని ఎంపీలకు సూచించారు. అంత‌రాష్ట్ర న‌దీ జ‌లాల విష‌య‌మై ఇటీవ‌ల క‌ర్ణాట‌క‌లో జ‌ల్‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్ ఆధ్వ‌ర్యంలో ఏపీ, క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రుల‌తో చ‌ర్చించిన అంశాల‌ను ఎంపీల‌కు సీఎం వివ‌రించారు.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి బెంగ‌ళూరు, చెన్నై, ముంబ‌యిల‌కు వెళ్లే బుల్లెట్ రైళ్ల‌కు సంబంధించి ఎలైన్‌మెంట్లు కొలిక్కివ‌చ్చాయ‌ని సీఎం తెలిపారు. ఆదిలాబాద్ ఢిపెన్స్ ఎయిర్‌పోర్ట్‌, వ‌రంగ‌ల్ ఎయిర్‌పోర్ట్‌ల‌కు అవ‌స‌ర‌మైన భూ సేక‌ర‌ణ పూర్తి చేశామ‌ని.. ఈ ఎయిర్‌పోర్టుల్లో ఎంఆర్‌వో, ఎయిర్ కార్గోలు ఏర్పాటు చేయాల‌ని కేంద్రాన్ని కోరాలని చెప్పారు. అన్ని పార్టీల ఎంపీల‌ను స‌మ‌న్వ‌యం చేసుకొని ముందుకు సాగాల‌ని ఎంపీల క‌న్వీన‌ర్ డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వికి ముఖ్యమంత్రి సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>