కలం, కరీంనగర్ బ్యూరో: భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కరీంనగర్లో పర్యటించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ అమరవీరుడు కానిస్టేబుల్ కిష్టయ్య నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కిష్టయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి, ఉద్యమంలో చేసిన త్యాగాలను స్మరించుకున్నారు.
కిష్టయ్య సతీమణి పద్మావతి , కుమారుడు రాహుల్ , కోడలు వర్ష , కుమార్తె డాక్టర్ ప్రియాంకతో ఆత్మీయంగా మాట్లాడి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఇటీవల జన్మించిన కిష్టయ్య మనవడు వేదాంత్ రాఘవ కిష్టయ్యను ఆశీర్వదించారు. చిన్నారికి వస్త్రాలు, కానుకలు అందజేయడంతో పాటు, కిష్టయ్య పేరులోని ‘K’ అక్షరంతో రూపొందించిన ప్రత్యేక లాకెట్‌ను బహూకరించారు. దీంతో పాటు కేసీఆర్ కిట్ అందించారు.
కేసీఆర్ పంపించిన చెక్ అందజేత..
కిష్టయ్య కుమార్తె డాక్టర్ ప్రియాంక మెడిసిన్ పీజీ విద్యాభ్యాసం కోసం బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రకటించిన ఆర్థిక సాయంలో భాగంగా ఫీజుల చెక్కును కేటీఆర్ అందజేశారు. కిష్టయ్య కుటుంబానికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఇంటికి వచ్చి పరామర్శించి, మనవడిని ఆశీర్వదించి, కుటుంబానికి ధైర్యం చెప్పడంతో పాటు కుమార్తె విద్యకు ఆర్థిక సాయం అందించిన కేటీఆర్‌కు కిష్టయ్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
కేటీఆర్ చూపిన ఆప్యాయత, ఆదరణ కుటుంబ సభ్యులను భావోద్వేగానికి గురిచేసింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, కౌశిక్ రెడ్డి, సంజయ్, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

