కలం, వెబ్ డెస్క్: షాబాద్ (Shabad) మండలంలో ఆరుగురిని అత్యంత కిరాతకంగా హత్య చేసిన రాజ్ కుమార్ మృతిపై ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి కీలక ప్రకటన చేశారు. ‘రాజ్ కుమార్ బెట్టింగ్ వ్యసనాలకు అలవాటై.. చాలా సిమ్ కార్డులు ఉపయోగిస్తున్నాడు. రూ.2 కోట్ల అప్పులు చేయడంతో.. మానసిక సమస్యలతో బాధపడుతున్నాడు. ఘటన జరిగిన రోజు రాజ్ కుమార్ కారు అద్దెకు తీసుకుని రాత్రి 10.30 గంటలకు ఊరిలోకి వచ్చాడు. మొదట అమ్మాయి వాళ్ల ఇంటికి వెళ్లి.. అమ్మ, నాన్నమ్మను కత్తితో పొడిచి చంపేశాడు’ అని సీపీ తెలిపారు.
చివరగా మైనర్ బాలిక హత్య..
అనంతరం, మైనర్ బాలికను కారులో తీసుకుని దేవరకొండలోని తన ఇంటికి తీసుకొచ్చాడని సీపీ తరుణ్ జోషి తెలిపారు. ‘అక్కడ తన భార్య, ఇద్దరు పిల్లలను చంపేశాడు. అనంతరం కారులోనే ఉన్న బాలికను తీసుకుని అక్కడి నుంచి 200 మీటర్ల దూరంలోకి తీసుకెళ్లి.. మైనర్ బాలికను కూడా అతి దారుణంగా హత్య చేశాడు. రెండు వేర్వేరు కత్తులు వాడాడు. హత్యలు చేశాక, రాజ్ కుమార్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. ఆరుగురిని చంపేసినట్లు ఫోన్లో చెప్పాడు’ అని సీపీ వివరించారు.
సెల్ఫీ వీడియో తీసుకున్నాాడు..
రాజ్ కుమార్ జులై 10వ తేదీన సెల్ఫీ వీడియో తీసుకున్నాడని సీపీ తెలిపారు. తీవ్రంగా అప్పుల పాలవడంతో, చెడు వ్యసనాలకు బానిసై సైకోలా మారిపోయాడన్నారు. మైనర్ బాలికను వేధిస్తుండటంతో బాధితులు పోక్సో కేసు నమోదు పెట్టారని వివరించారు. రాజ్ కుమార్ ప్రవర్తనతో విసిగిపోయిన భార్య.. అతడికి విడాకులు ఇవ్వాలని కూడా నిర్ణయించుకుందన్నారు. దీంతో, అందరిపై కక్ష గట్టి.. హత్యలకు పాల్పడినట్లు వివరించారు.
డయల్ 100 ద్వారా సమాచారం..
డయల్ 100 ద్వారా తమకు మృతదేహం గురించి సమాచారం వచ్చిందని సీపీ తరుణ్ జోషి చెప్పారు. వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లి.. చనిపోయిందని నిందితుడే అని నిర్ధారణ చేసుకున్నామని వివరించారు. రాజ్ కుమార్ దగ్గర ఫోన్, కొంత నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు ఇంకా దర్యాప్తు చేస్తున్నామని.. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు.

