కలం, మెదక్ బ్యూరో: కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డ్యామ్ సేఫ్టీ అధికారులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అలాగే ప్రతిపక్షాలతో కలిపి ఒక ఉమ్మడి సమావేశాన్ని ఏర్పాటు చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jagga Reddy) అన్నారు. అలా మీటింగ్ పెడితేనే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అసలు నిజానిజాలు ఏంటో ప్రజల ముందుకు వస్తాయని స్పష్టం చేశారు. కేంద్ర జలవనరుల శాఖ బీజేపీ వద్దే ఉందనే విషయం మర్చిపోవద్దని, డ్యాం సేఫ్టీ అధికారులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని జగ్గారెడ్డి సవాల్ విసిరారు. SIR ప్రక్రియపై సంగారెడ్డి నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో జగ్గారెడ్డి పాల్గొని మాట్లాడరు.
బండి సంజయ్ పై ఫైర్..
బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉండటం తెలంగాణ ప్రజల దురదృష్టకరమని జగ్గారెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆయనకు కనీస అవగాహన లేదని, ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వకుండానే మంత్రి పదవి కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. పదేళ్లపాటు రాష్ట్రంలో బీఆర్ఎస్, కేంద్రంలో బీజేపీ కలిసి సంసారం చేశాయని ఆరోపించారు. ఇరు పార్టీల మధ్య పదేళ్లుగా బలమైన రాజకీయ సంబంధాలు ఉన్నాయని విమర్శించారు.

