చిన్నారితో ఎస్ఐ కార్ డ్రైవింగ్: డీజీపీ కీలక ఆదేశాలు!

కలం, వెబ్ డెస్క్ : బాధ్యతాయుతమైన పోలీస్ ఉద్యోగంలో ఉండి నిర్లక్ష్యంగా వ్యవహరించిన సబ్ ఇన్స్పెక్టర్ పై నార్సింగి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గంధంగూడ-బైరాగిగూడ ప్రధాన రహదారిపై ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ సిటీ పోలీస్‌కు చెందిన ఎస్ఐ పూజారి తిరుపతి (SI Pujari Tirupati) తన ఆరున్నరేళ్ల మనవరాలిని డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి, స్టీరింగ్ చేతికి ఇచ్చి రద్దీగా ఉండే మెయిన్ రోడ్డుపై కారు నడిపించారు. చిన్నారి కారు నడుపుతుండటంతో వెనుక వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

రోడ్డుపై వెళ్తున్న తోటి వాహనదారులు ఈ దృశ్యాన్ని చూసి ఎస్ఐ నిలదీయగా, ఆయన తన తప్పును ఒప్పుకోకుండా బుకాయించే ప్రయత్నం చేశారు. ఇది ఆటోమేటిక్ కారు అని, కంట్రోల్ అంతా తన చేతుల్లోనే ఉందంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. అంతేకాకుండా, తన మనవరాలిని ప్రపంచంలోనే అతి చిన్న వయస్కురాలైన డ్రైవర్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డు కోసం సిద్ధం చేస్తున్నానని వింత వాదనలు చేశారు. స్థానికులు ప్రశ్నిస్తున్న సమయంలో డ్రైవింగ్ సీట్లో ఉన్న ఆ చిన్నారి కూడా ‘మా తాత ఎస్ఐ తెలుసా’ అంటూ మాట్లాడటం గమనార్హం.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు, ప్రజలు సదరు పోలీస్ అధికారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) స్పందించారు. ఈ నిర్లక్ష్యంపై తక్షణమే విచారణ జరిపి సదరు అధికారిని సస్పెండ్ చేయాలని, శాఖాపరమైన విచారణ ప్రారంభించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం. రమేష్‌ను ఆదేశించారు. నిందితుడైన ఎస్ఐ పూజారి తిరుపతి (SI Pujari Tirupati)పై నార్సింగి పోలీసులు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 125 తో పాటు మోటార్ వాహనాల చట్టంలోని సెక్షన్లు 180, 184 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సదరు కారుపై ఇదివరకే సుమారు 4,010 రూపాయల పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు ఉన్నట్లు కూడా పోలీసులు గుర్తించారు.

Read Also : గజ్వేల్‌ కాంగ్రెస్‌లో ‘రెబెల్’ మంటలు..పీసీసీ చీఫ్ వర్సెస్ తూంకుంట

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>