జూలై 15న కొత్తకోటకు సీఎం రేవంత్.. ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే

కలం, వనపర్తి : ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. జూలై 15న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తకోట (Kothakota) పట్టణంలో పర్యటించి నూతనంగా నిర్మించిన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, జిల్లా ఎస్పీ సునీతా రెడ్డి, విద్యాశాఖ అధికారులతో కలిసి పాఠశాల ప్రాంగణాన్ని, ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. రూ. 1.77 కోట్ల సీఎస్ఆర్ నిధులు, దాతల సహకారంతో కొత్తకోట (Kothakota) ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, రూ. 33. 50 లక్షల వ్యయంతో పీఎం శ్రీ కింద లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ నూతన భవనాల నిర్మాణాన్ని పూర్తిచేసి, జూలై 15న ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

గతంలో ఈ పాఠశాలలో బాలికలు తగిన సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువుకున్నారని, ప్రస్తుతం ఆధునిక వసతులతో కూడిన భవనం అందుబాటులోకి రావడం విద్యార్థినులకు ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి నియోజకవర్గంలో “యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్”లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరానికల్లా ఈ పాఠశాలలు పూర్తై సుమారు 2,500 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, ఇతర వెనుకబడిన వర్గాల విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.

ప్రభుత్వ పాఠశాలల్లో అత్యాధునిక ల్యాబ్‌లు, డిజిటల్ ప్యానెల్ బోర్డులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత విద్యను అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడబోదని స్పష్టం చేశారు. జూలై 15న ముఖ్యమంత్రి ముందుగా మహబూబ్‌నగర్‌లోని అమరరాజా సంస్థ కార్యక్రమంలో పాల్గొని, అనంతరం మధ్యాహ్నం కొత్తకోటకు చేరుకుని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారని తెలిపారు. ప్రారంభోత్సవం అనంతరం విద్యార్థులతో ప్రత్యేకంగా ముఖాముఖి నిర్వహించి, ప్రభుత్వ విద్యలో తీసుకొస్తున్న సంస్కరణలు, భవిష్యత్ కార్యాచరణపై వారితో మాట్లాడనున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమాన్ని పూర్తిగా విద్యార్థుల కోసం నిర్వహిస్తున్నందున రాజకీయ ప్రసంగాలకు తావు లేకుండా విద్యా అంశాలకే ప్రాధాన్యం ఇస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసం పెరగడంతో గత ఏడాదితో పోలిస్తే విద్యార్థుల ప్రవేశాలు కూడా గణనీయంగా పెరిగినట్లు ఆయన పేర్కొన్నారు.
ఈ పరిశీలన కార్యక్రమంలో ఏఎస్పీ వీరారెడ్డి, జెడ్పి సీఈవో యాదయ్య, జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

Read Also: చిన్నారితో ఎస్ఐ కార్ డ్రైవింగ్: డీజీపీ కీలక ఆదేశాలు!

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>