కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రముఖ సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao)పై బేగంబజార్ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. లైవ్ డిబేట్ కార్యక్రమం జరుగుతుండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ముఖ్యమంత్రిపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను యాంకర్ గా ఉన్న కొమ్మినేని అడ్డుకోలేదని, ఆ వ్యాఖ్యలను ప్రోత్సహించేలా వ్యవహరించారంటూ టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కైలాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు యాంకర్ పై చర్యలకు దిగారు.
ఇదే కేసులో ఇప్పటికే వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో అదుపులోకి తీసుకున్నారు. అయితే, ముందస్తుగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారంటూ నాగార్జున యాదవ్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఉదంతం ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయ, మీడియా వర్గాల్లో సంచలనంగా మారింది.

