కలం మెదక్ బ్యూరో: కాలం పరుగులు తీసింది.. జీవితాలు మారాయి.. బాధ్యతలు పెరిగాయి.. ఎవరి దారిలో వారు సాగిపోయారు. కానీ 50 ఏళ్ల క్రితం పాఠశాల గదుల్లో చిగురించిన స్నేహం మాత్రం చెక్కుచెదరలేదు. అర్ధ శతాబ్దం తర్వాత చిన్ననాటి నేస్తాలంతా ఒక్కచోట చేరడంతో ఆత్మీయత వెల్లివిరిసింది. సదాశివపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1975-76 పదో తరగతి బ్యాచ్ గోల్డెన్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం అపూర్వ జ్ఞాపకాలకు వేదికైంది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే (Sangareddy MLA) చింత ప్రభాకర్ పాల్గొని తన పదో తరగతి సహచరులతో కలిసి బాల్య జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు.
ఎన్నో ఏళ్ల తర్వాత ఎదురుపడిన నేస్తాలను చూడగానే ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి. ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు. “ఎలా ఉన్నావురా..?” అంటూ పలకరించుకుంటూ ఆనాటి పాఠశాల రోజులు, తరగతి గదుల్లో చేసిన అల్లరి, గురువుల మందలింపులు, కలిసి పంచుకున్న నవ్వులను గుర్తుచేసుకున్నారు. కొన్ని జ్ఞాపకాలు నవ్విస్తే.. మరికొన్ని కళ్లను చెమ్మగిల్లేలా చేశాయి.
తమకు అక్షరాలు నేర్పి, జీవితానికి దారి చూపిన గురువులు సైతం సమావేశానికి హాజరుకావడంతో పూర్వ విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గురువులను ఆప్యాయంగా పలకరించి ఆశీస్సులు తీసుకున్నారు. 50 ఏళ్ల నాటి మిత్రులందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు బ్యాచ్‌మెట్స్ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమానికి వచ్చిన చిన్ననాటి మిత్రులను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శాలువాలతో సత్కరించి తన ఆత్మీయతను చాటుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ.. “చాలా ఏళ్ల తర్వాత నా పదో తరగతి స్నేహితులందరినీ ఇలా ఒకే చోట చూడటం మాటల్లో చెప్పలేని ఆనందాన్నిస్తోంది. చిన్నతనంలో ఎన్నో కష్టాలు చూశాం. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాం. చూస్తుండగానే 50 ఏళ్లు గడిచిపోయాయి. ఈ వయసులో కలుసుకోవడం నిజంగా మన అదృష్టం అని అన్నారు.

