కలం, ఖమ్మం బ్యూరో: జిల్లాలోని నేలకొండపల్లి మండలంలో అడవి పందుల అక్రమ రవాణా (Wild Boar Smuggling) గుట్టు రట్టయింది. ఆదివారం నేలకొండపల్లి పోలీసులు సాధారణ పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఈ వ్యవహారం వెలుగుచూసింది. మండలంలోని చెరువుమాధారం గ్రామం వద్ద రోడ్డు పక్కన అనుమానాస్పదంగా నిలిపి ఉంచిన ఒక మినీ డీసీఎం వాహనాన్ని పోలీసులు గమనించారు.
అనుమానంతో వాహనాన్ని తనిఖీ చేయగా, అందులో కాళ్లు, నోరు కట్టిపడేసి ఉన్న ఏడు అడవి పందులు కనిపించడంతో పోలీసులు అవాక్కయ్యారు. మాంసం విక్రయించడం కోసమే వీటిని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. వెంటనే స్పందించిన పోలీసులు వాహనాన్ని, డ్రైవర్ పుట్టబంతి నాగయ్యను, అలాగే ఆ 7 అడవి పందులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
ఈ సమాచారాన్ని ఉన్నతాధికారుల సూచన మేరకు అటవీ శాఖ అధికారులకు చేరవేశారు. అయితే క్రూరంగా కాళ్లు, నోరు కట్టేసి వాహనంలో తరలించడం వల్ల గాలి ఆడక అప్పటికే రెండు అడవి పందులు మృతి చెందాయి. స్వాధీనం చేసుకున్న మిగిలిన ఐదు అడవి పందులను వెలుగుమట్ల అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టినట్లు ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు తెలిపారు.
అలాగే చనిపోయిన రెండు పందులకు పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ అక్రమ రవాణాకు పాల్పడిన నిందితుడిపై అటవీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

