కలం, నిర్మల్: జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలోని ప్రసిద్ధ శ్రీ మహాపోచమ్మ ఆలయ (Adelli Mahapochamma Temple) ధర్మకర్తల మండలి నియామకం ఈసారి విశేష ఆసక్తిని రేకెత్తిస్తోంది. ధర్మకర్తల పదవుల కోసం ఏకంగా 55 మంది ఆశావాహులు దరఖాస్తు చేసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గత నెల జూన్ 19న దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉప కమిషనర్ ధర్మకర్తల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేశారు. 20 రోజుల గడువులోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించగా, గడువు ముగిసే నాటికి మొత్తం 55 దరఖాస్తులు అందాయి.
ఈ స్థాయిలో స్పందన రావడంతో ఆలయ ధర్మకర్తల నియామకం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఉత్తర తెలంగాణలో ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన ఆలయాల్లో అడెల్లి శ్రీ మహాపోచమ్మ ఆలయం ఒకటి. ప్రతి ఏడాది జరిగే జాతరకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఆలయానికి రోజువారీగా కూడా గణనీయమైన భక్తుల రాక ఉండటంతో పాటు హుండీ ఆదాయం, అభివృద్ధి కార్యక్రమాలు, ఆలయ పరిపాలనలో ధర్మకర్తల పాత్ర కీలకంగా ఉంటుంది. ఈ కారణంగానే ధర్మకర్తల పదవులపై ఆసక్తి పెరిగిందని స్థానికులు భావిస్తున్నారు.
అందిన దరఖాస్తులను దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయనుంది. అనంతరం ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ధర్మకర్తల మండలితో పాటు చైర్మన్ ను ఎన్నుకోనున్నారు. కొత్తగా ఏర్పడే ధర్మకర్తల మండలి ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని భక్తులు కోరుతున్నారు. మొత్తానికి 55 మంది ఆశావాహులు బరిలో నిలవడంతో అడెల్లి మహాపోచమ్మ ఆలయ ధర్మకర్తల నియామకం ఇప్పుడు జిల్లాలో అత్యంత ఆసక్తికర అంశంగా మారింది.

