కలం మెదక్ బ్యూరో: సంగారెడ్డి జిల్లా అందోల్‌లో (Andole) ఉద్రిక్తత చోటుచేసుకుంది. తమకు న్యాయం చేయాలంటూ వట్ పల్లి మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాల విద్యార్థినులు అందోల్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. ప్రిన్సిపాల్ ప్రవర్తనకు నిరసనగా విద్యార్థినులు రోడ్డుపైనే కంటతడి పెట్టడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. వట్ పల్లి గురుకుల పాఠశాలకు సొంత భవన సదుపాయం లేకపోవడంతో, గత కొంతకాలంగా 150 మంది విద్యార్థినులను అందోల్ గురుకుల పాఠశాల క్యాంపస్‌లోనే ఉంచి విద్యాబోధన అందిస్తున్నారు.
ప్రస్తుతం అందోల్ గురుకులానికి చెందిన 150 మంది, వట్టపల్లికి చెందిన 150 మంది విద్యార్థినులు ఒకేచోట విద్యాభ్యాసం సాగిస్తున్నారు. తమ క్యాంపస్‌లో ఉంటున్నారనే నెపంతో అందోల్ గురుకుల ప్రిన్సిపాల్ జ్యోతి.. విద్యార్థినులపై తీవ్ర వివక్ష చూపిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వెంటనే తమ పాఠశాల నుండి ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ ప్రిన్సిపాల్ పలుమార్లు విద్యార్థినులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రిన్సిపాల్ వేధింపులు, దురుసు ప్రవర్తనతో విసుగుచెందిన వట్పల్లి విద్యార్థినులు ఆదివారం రోడ్డుపైకి వచ్చి ఆందోళనకు దిగారు.
”మాకు సొంత భవనం లేకపోవడం మా తప్పా? ప్రిన్సిపాల్ మేడం మమ్మల్ని ప్రతిరోజూ మానసికంగా వేధిస్తున్నారు. ఇక్కడి నుండి వెళ్లిపోవాలంటూ నానా మాటలు అంటున్నారు” అని విద్యార్థినులు ఆవేదనను వ్యక్తం చేశారు.

