కలం, వలిగొండ: రైతులకు ఎరువులు, విత్తనాల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి (Anurag Jayanthi) అన్నారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని గ్రోమోర్ ఎరువులు, విత్తనాల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలో అందుబాటులో ఉన్న యూరియా, డీఏపీతో పాటు ఇతర ఎరువుల నిల్వల వివరాలను దుకాణ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం షాపులో యూరియా, డీఏపీ ఎంత మేరకు నిల్వ ఉందో, ఇప్పటివరకు రైతులకు ఎంత మేరకు విక్రయించారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతులు నేరుగా దుకాణానికి వచ్చి ఎరువులు కొనుగోలు చేస్తున్నారా లేదా ఫర్టిలైజర్ యాప్లో ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి మాత్రమే విక్రయిస్తున్నారా అనే విషయాన్ని స్వయంగా ఫర్టిలైజర్ యాప్లో పరిశీలించి ధృవీకరించారు.
ఎరువుల విక్రయాల్లో పూర్తి పారదర్శకత పాటించాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులు, ఎల్నీనో ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున రైతులు వరి పంటకు బదులుగా తక్కువ నీటితో సాగు చేయగల పత్తి, కందులు, ఇతర ప్రత్యామ్నాయ సాగుపై దృష్టి సారించేలా విస్తృత అవగాహన కల్పించాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు.
యూరియా కోసం మీ సేవ ద్వారా రైతులు ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని, రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, నిల్వలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఎలాంటి కృత్రిమ కొరత లేదా అక్రమ నిల్వలు జరగకుండా నిరంతరం తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు.

