కలం, నకిరేకల్: నకిరేకల్ (Nakrekal) నియోజకవర్గ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైల్వే ఫ్లైఓవర్ నిర్మాణానికి ఆదివారం శ్రీకారం చుట్టారు. నార్కెట్‌పల్లి మండలం నుంచి బ్రహ్మణవెల్లంల గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిపై రూ.76 కోట్ల వ్యయంతో నిర్మించనున్న రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పనులకు రాష్ట్ర రోడ్లు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy), ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం (Vemula Veeresham) శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ప్రజలకు నాణ్యమైన రహదారి మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్న ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే నార్కెట్‌పల్లి, బ్రహ్మణవెల్లంలతో పాటు పరిసర గ్రామాల ప్రజలకు ట్రాఫిక్ సమస్యల నుంచి శాశ్వత విముక్తి లభిస్తుందని తెలిపారు. అత్యవసర వైద్య సేవలు, రోజువారీ రాకపోకలు మరింత వేగవంతం అవుతాయని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం మాట్లాడుతూ, ఇది నకిరేకల్ నియోజకవర్గ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని అన్నారు. రైల్వే గేటు కారణంగా తరచూ ఏర్పడే ట్రాఫిక్ ఇబ్బందులకు ఈ ఫ్లైఓవర్‌తో శాశ్వత పరిష్కారం లభిస్తుందని చెప్పారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, వ్యాపారులు, ప్రయాణికులకు సమయం ఆదా కావడంతో పాటు ప్రయాణం సురక్షితంగా, సౌకర్యవంతంగా మారుతుందని అన్నారు.
ప్రజల అవసరాలకు అనుగుణంగా నియోజకవర్గంలో రోడ్లు, వంతెనలు, త్రాగునీరు, విద్య, వైద్యం వంటి రంగాలలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, నకిరేకల్‌ను అన్ని రంగాలలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని వీరేశం స్పష్టం చేశారు. ఈ సమస్య పరిష్కారానికి సహకరించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

