కలం, వెబ్ డెస్క్ : సాధారణంగా మంత్రులు వస్తున్నారంటే కాన్వాయ్‌లు, పోలీసు బందోబస్తు లాంటి హడావుడి ఉంటుంది. కానీ కర్ణాటక రవాణా శాఖ మంత్రి బైరతి సురేష్ (Minister Byrathi Suresh) దీనికి భిన్నంగా వ్యవహరించి అందరికి షాకిచ్చారు. బెంగళూరులో రవాణా సేవలు ఎలా సాగుతున్నాయో స్వయంగా తెలుసుకునేందుకు ఆయన సామాన్య ప్రయాణికుడిలా మారారు. తాను ఎవరో తెలియకుండా ముఖానికి మాస్క్ ధరించి బస్సుల్లో , ఆటోల్లో ప్రయాణించి క్షేత్ర స్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేశారు.
దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ ఆకస్మిక తనిఖీల్లో మంత్రి 10కి పైగా BMTC (బెంగళూరు మహానగర రవాణా సంస్థ) బస్సుల్లో ప్రయాణించారు. ఈ క్రమంలో ప్రయాణికులు నిత్యం ఎదుర్కొనే చేదు అనుభవాలను ఆయనకు కూడా ఎదురయ్యాయి. విధుల్లో ఆర్టీసీ సిబ్బంది నిర్లక్ష్యం, ఆటో డ్రైవర్ దోపిడీలను గమనించిన మంత్రి వారిపై చర్యలు తీసుకున్నారు.
నిబంధలు ఉల్లంఘించిన వారిపై వేటు
మంత్రి (Minister Byrathi Suresh) తన రెండు గంటల ప్రయాణంలో ప్రజా రవాణాలోని లోపాలను ప్రత్యక్షంగా చూశారు. ఒక స్టాండ్‌లో ప్రయాణికలు వేచి ఉన్నప్పటికీ బస్సును ఆపకుండా వెళ్లిపోయిన ఒక డ్రైవర్ , కండక్టర్ పై మంత్రి తక్షణమే చర్యలు తీసుకున్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిందుకు వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. టికెట్ డబ్బులకు సరిపడా చిల్లర లేదన్న కారణంతో ఓ కండక్టర్ ను ఏకంగా మంత్రిని దిగిపోవాలని కోరారు.
సామాన్య ప్రయాణికులతో సిబ్బంది ఎంత కఠినంగా ఉంటారో ఈ ఘటనతో మంత్రికి తెలిసింది. దీంతో సదరు కండక్టర్‌ను మందలించారు. అటు బస్సుల్లోనే కాకుండా ఆటోల్లో కూడా ప్రయాణించిన మంత్రి.. ఆటో డ్రైవర్ల దోపిడీని పరిశీలించారు. మీటర్ ప్రకారం రూ. 30 అవ్వాల్సిన ప్రయాణానికి రూ. 36 డిమాండ్ చేసిన ఒక ఆటో డ్రైవర్‌ను మంత్రి నిలదీశారు. ప్రయాణికులను మోసం చేయవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు.
ఈ క్రమంలోనే ప్రజా రవాణాను నమ్ముకున్న సామాన్యులను ఇబ్బంది పెడితే సహించేది లేదని మంత్రి తేల్చి చెప్పారు. సిబ్బంది ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించాలని ఆదేశించారు. ఇలాంటి ఆకస్మిక తనిఖీలు మున్ముందు కూడా కొనసాగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. మంత్రి బైరతి సురేష్ ఇలా స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లి ప్రయాణికుల సమస్యలు తెలుసుకోవడంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. అధికారులు, సిబ్బంది ఇకనైన బాధ్యతగా పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు.
Read Also: లీకేజీలు, వైరింగ్ లోపాలను ముందే కనిపెట్టే సరికొత్త గ్యాడ్జెట్!
Follow Us On: Instagram
బెంగళూరు బస్సుల్లో మంత్రి సీక్రెట్ రైడ్
-BMTC బస్సుల్లో రవాణా మంత్రి బైరతి సురేష్ మాస్క్ ధరించి తనిఖీలు
-ప్రయాణికుల కోసం బస్సును ఆపకుండా వెళ్లిన ఒక డ్రైవర్‌ను, కండక్టర్‌ను సస్పెండ్
-అలాగే మీటర్ ఛార్జీ రూ. 30 అయితే, రూ. 36 ఇవ్వాలని డిమాండ్ చేసిన ఒక ఆటో డ్రైవర్‌ను హెచ్చరించిన… pic.twitter.com/NwFZPSuSST— Kalam Daily (@kalamtelugu) July 12, 2026

