కలం, తెలంగాణ బ్యూరో : తెలంగాణలోని ఉపాధ్యాయ సంఘాలపై ప్రభుత్వ పాఠశాల టీచర్ల(Telangana Teachers)లో అసంతృప్తి పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగుల హక్కుల సాధనపై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడంలో సంఘాల ప్రతినిధులు విఫలమయ్యారనే ఆరోపణలతో, ఇకపై ఏ టీచర్ల సంఘానికీ వార్షిక సభ్యత్వ రుసుము చెల్లించవద్దంటూ ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఇది మిగిలిన పాఠశాలల ఉపాధ్యాయులకూ తెలియడంతో చర్చనీయాంశమైంది.
మెదక్ జిల్లా నార్సింగి మండలం శేరిపల్లి ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల టీచర్లు కలిసి తీసుకున్న ఈ తీర్మానం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఉపాధ్యాయులు ఎవరూ ఒకే సంఘానికి చెందినవారు కాకపోవడం విశేషం. వేర్వేరు సంఘాల్లో ఉన్నప్పటికీ, తమ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయం వచ్చేలా చేయడంలో ఈ సంఘాలన్నీ విఫలమయ్యాయనేది వారి ప్రధాన అసంతృప్తి. ప్రభుత్వ పెద్దలపై కనీస ఒత్తిడి కూడా పెంచలేకపోయారని వారు వాదిస్తున్నారు. ప్రస్తుతం ఈ నిర్ణయం ఒకే పాఠశాలకు పరిమితమైనప్పటికీ, సోషల్ మీడియా వేదికగా ఈ వార్త దావానలంలా వ్యాపిస్తుండటంతో ఇతర పాఠశాలలకు విస్తరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీర్ఘకాలిక సమస్యల నిర్లక్ష్యంపై ఆగ్రహం
ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కీలక సమస్యల పరిష్కారంలో సంఘాలు విఫలమయ్యాయని ఆ పాఠశాల టీచర్లు తీర్మానం చేస్తున్న సందర్భంగా ఏకాభిప్రాయానికి వచ్చారు. ముఖ్యంగా సీపీఎస్ (కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) అమలు చేయాలన్నది టీచర్ల దీర్ఘకాల డిమాండ్ అని గుర్తుచేశారు. దీనిపై సంఘాలు ఆశించిన స్థాయిలో పోరాడలేకపోయాయని మండిపడుతున్నారు.
దీనితో పాటు సుమారు ఆరు డీఏల బకాయిల విడుదల, పీఆర్సీ (వేతన సవరణ కమిషన్) ఫిట్మెంట్, అలాగే హెల్త్ కార్డుల పేరుతో బేసిక్ పే నుంచి 1.5% మినహాయించడం వంటి కీలక అంశాలపై ప్రభుత్వంతో సమర్థవంతంగా చర్చలు జరపడంలో సంఘాల నేతలు విఫలమయ్యారని టీచర్లు ఓపెన్‌గానే కామెంట్లు చేస్తున్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే సంఘాల బాధ్యత అయినప్పుడు, ఎలాంటి ఉద్యమాలు చేయని వారికి ప్రతీ ఏటా సభ్యత్వ రుసుము ఎందుకు చెల్లించాలనే ప్రశ్న ప్రస్తుతం ఉపాధ్యాయ లోకంలో బలంగా వినిపిస్తోంది.
ఇతర ఉద్యోగ సంఘాలకూ ఇదో హెచ్చరికా?
ఈ తీర్మానంలో ఏ ఒక్క సంఘాన్ని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోకుండా, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయని అన్ని సంఘాలనూ తప్పుపట్టడం గమనార్హం. కేవలం సంఘాల పేరుతో చందాలు వసూలు చేయడం కాకుండా సమస్యల పరిష్కారమే ముఖ్యమని, డిమాండ్లు నెరవేరే వరకు సభ్యత్వ రుసుములను నిలిపివేయాలని వారు కరాఖండిగా తేల్చి చెప్పారు.
ప్రస్తుతం ఈ నిర్ణయం ఒక పాఠశాలకే పరిమితమైనా, డీఏలు, పీఆర్సీ, సీపీఎస్, బదిలీలు, పదోన్నతులు, హెల్త్ స్కీమ్ వంటి సమస్యలు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నందున.. ఈ తీర్మానం ఇతర జిల్లాలకు కూడా పాకే ప్రమాదం ఉందని సంఘాల నేతలు ఆందోళన చెందుతున్నారు. కేవలం ఉపాధ్యాయ సంఘాలకే కాకుండా, రాష్ట్రంలోని ఇతర ప్రభుత్వ ఉద్యోగ సంఘాల్లోనూ ఇదే తరహా అసంతృప్తి నెలకొనడంతో, ఈ పరిణామం భవిష్యత్తులో ఉద్యోగ సంఘాల మనుగడకే పెద్ద సవాలుగా మారేలా కనిపిస్తోంది.
Read Also: కమలంలో కలవరం.. ‘ఈటల’ గురి ఎటు?
Follow Us On: Instagram

